Share News

నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికపై ఉత్కంఠ

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:01 AM

నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నలుగురు ఆశావహులు, నలభై వేల మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం నందిగామ చైర్‌పర్సన్‌ ఎంపికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల అధికారిగా నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణను నియమించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మునిసిపల్‌ పీఠాన్ని గెలుచుకున్న వైసీపీ చైర్‌పర్శన్‌ స్థానంలో మండవ వరలక్ష్మిని కూర్చోబెట్టారు. ఆమె అకాల మరణం చెందారు. దీంతో ఇన్‌చార్జిగా ఓర్సు లక్ష్మి కొనసాగుతున్నారు.

నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికపై ఉత్కంఠ

-నేడు చైర్‌పర్సన్‌ ఎన్నిక.. ఏర్పాట్లు చేసిన అధికారులు

-కుర్చీ కోసం నలుగురు ఆశావహుల ప్రయత్నాలు

-పెదవి విప్పని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):

నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నలుగురు ఆశావహులు, నలభై వేల మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం నందిగామ చైర్‌పర్సన్‌ ఎంపికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల అధికారిగా నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణను నియమించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మునిసిపల్‌ పీఠాన్ని గెలుచుకున్న వైసీపీ చైర్‌పర్శన్‌ స్థానంలో మండవ వరలక్ష్మిని కూర్చోబెట్టారు. ఆమె అకాల మరణం చెందారు. దీంతో ఇన్‌చార్జిగా ఓర్సు లక్ష్మి కొనసాగుతున్నారు.

కౌన్సిల్‌లో బలాబలాలు

నందిగామ మునిసిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, గత ఎన్నికల్లో వైసీపీ 13 స్థానాలు గెలిచింది. టీడీపీ ఆరు, జనసేన ఒక స్థానం దక్కించుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత వైసీపీకి చెందిన కౌన్సిలర్లు పెద్దయెత్తున టీడీపీలో చేరారు. తాజాగా 19వ వార్డు కౌన్సిలర్‌ మందా మరియమ్మ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరుతానన్న అంశాన్ని త్వరలో ప్రకటిస్తానన్నారు. ప్రస్తుతం వైసీపీకి చైర్‌పర్సన్‌తో సహా మొత్తం ముగ్గురు సభ్యులు మాత్రమే కౌన్సిల్‌లో ఉన్నారు. 7, 11వ వార్డుల సభ్యులు మరణించడంతో ఆ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వలస కౌన్సిలర్లతో కలిపి టీడీపీకి 14 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీకి రాజీనామా చేసిన మందా మరియమ్మ కూడా టీడీ పీలో చేరే అకాశం ఉండడంతో బలం మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్నిబట్టి చైర్‌పర్సన్‌ ఎంపిక లాంఛనం కానుంది.

కుర్చీపై ఆశావహుల ఆశలు

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠం కోసం నలుగురు కౌన్సిలర్లు ఆశాలు పెట్టుకున్నారు. తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న 8వ వార్డు కౌన్సిలర్‌ శాఖమూరి స్వర్ణలత నందిగామ సర్పంచ్‌గా పనిచేశారు. రెండు పర్యాయాలు 8వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. ప్రజలతో మంచి సంబంధాలు, పాలనలో అనుభవం ఉన్న ఆమె చైర్‌పర్సన్‌ పదవి కోసం పోటీపడుతున్నారు. 5వ వార్డు కౌన్సిలర్‌ ఏచూరి రత్నకుమారి భర్త ఏచూరి రామకృష్ణ టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తన భార్యకు చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈయనకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఆర్యవైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇచ్చింది. 14వ వార్డు కౌన్సిలర్‌, టీడీపీ సీనియర్‌ నాయకురాలు కామసాని సత్యవతి చైర్‌పర్సన్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నామని, ఏడుపదుల వయస్సుకు దగ్గర పడుతున్న తనకు చివరి అవకాశంగా ఈ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. 10వ వార్డు కౌన్సిలర్‌ మండవ కృష్ణకుమారి కూడా ఈ పదవికి పోటీపడుతున్నారు. గత ప్రభుత్వంలో అమరావతి పరిరక్షణకు ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఆమె భర్త శ్రీనివాసరావుపై వైసీపీ పాలకులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. పార్టీ కోసం, అమరావతి కోసం తాము ఇబ్బందులను ఎదుర్కొన్నామని చైర్‌పర్సన్‌ పదవి తమకు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మృతి చెందిన చైర్‌పర్సన్‌ మండవ వరలక్ష్మి కృష్ణకుమారికి తోటి కోడలు. ఎన్నికల సమయంలో వరలక్ష్మి భర్త మండవ పిచ్చయ్య కూడా టీడీపీలో చేరి పార్టీ విజయం కోసం కృషి చేశారు. ఈ కారణాల రీత్యా పదవి తమకు ఇవ్వాలని కృష్ణకుమారి కోరుతున్నారు. అయితే చైర్‌పర్సన్‌ పీఠం కోసం పోటీ పడుతున్న నలుగురు ముఖ్యమైన వారే కావడంతో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సౌమ్య తన నిర్ణయాన్ని తొందర పడి వ్యక్తం చేయకుండా మౌనం వహిస్తున్నారు. ప్రజల మనోభావాలను, పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సముచిత న్యాయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది?

నందిగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. చైర్‌పర్సన్‌ మండవ వరలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ మాడుగుల నాగరత్నంతో 7, 11వ వార్డులు ఖాళీగా ఉన్నాయి. ఆ వార్డులకు ఎప్పుడో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఇంత వరకూ నిర్వహించలేదు. దీంతో పట్టణానికి చెందిన వైసీపీ నాయకురాలు నాదెండ్ల హారిక హైకోర్టును ఆశ్రయించారు. తాను ఖాళీగా ఉన్న 11వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచి చైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌ పదవి చేపట్టేందుకు రాజ్యాంగం తనకు కల్పించిన పౌరహక్కులను కాపాడాలని ఆమె కోరారు. వార్డుల ఎన్నికలు పూర్తయ్యే వరకూ చైర్‌పర్శన్‌ ఎన్నిక నిలిపివేయాలని అభ్యర్థించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసును సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఉత్కంఠతకు తెరలేచింది. ఎన్నిక, కోర్టులో కేసు విచారణ రెండూ ఒక సమయంలో ఉన్నందున అటు అధికారులు, ఇటు అధికార ప్రతిపక్ష నాయకులు టెన్షన్‌కు గురవుతున్నారు. అధికారం వచ్చిన నాటి నుంచి చైర్‌పర్సన్‌ పీఠంపై కన్నేసి వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని ఎన్నికలకు సిద్ధంగా కూటమి నేతలు ఉండగా, రాజ్యాంగ దుర్వినియోగం పేరుతో వైసీపీ హైకోర్టు ద్వారా ఆఖరి పోరాటం చేస్తుంది. ఇరువురిలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Feb 03 , 2025 | 01:01 AM