Civil Services: ప్రజా పరిపాలనలో.. ఏలూరుకు ‘ప్రధానమంత్రి’ అవార్డు
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:39 AM
ప్రజా పరిపాలనలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఏలూరు జిల్లాకు కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి అవార్డు లభించింది. 788 జిల్లాల్లో ఎంపికైన 10 ఉత్తమ జిల్లాల్లో ఏలూరు ఒకటిగా నిలిచింది.
2023కిగానూ దేశంలోని 10 జిల్లాలు ఎంపిక
మోదీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అప్పటి ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు కేంద్ర స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు లభించింది. ప్రజా పరిపాలన ద్వారా మంచి ఫలితాలు సాధించిన ఏలూరుకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి అవార్డు’ లభించింది. 2023 ఏడాదికిగాను ఈ అవార్డు దక్కింది. సోమవారం 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అప్పుడు ఏలూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ప్రసన్న వెంకటేశ్ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉన్న 788 జిల్లాలకు గానూ 10 జిల్లాలు మాత్రమే ఈ పురస్కారానికి ఎంపిక అయ్యాయి. వీటిలో మన రాష్ట్రంలోని ఏలూరు ఒకటి. ప్రభుత్వ పరిపాలనలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులు, సంస్థలను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. అవార్డు అందుకున్న నేపథ్యంలో ప్రసన్న వెంకటేశ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పురస్కారం తనకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదని, ఇది జిల్లా యంత్రాంగం సమష్టి కృషికి గుర్తింపు అన్నారు. కేంద్ర ప్రభు త్వ ప్రతి కార్యక్రమాన్ని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేశానని, ఇందుకు సహకరించిన అధికారులకు, ఏలూరు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత
పశ్చిమగోదావరి జిల్లాను విభజించిన తర్వాత ఏలూరు జిల్లాకు తొలి కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్ నియమితులయ్యారు. 2023లో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం, కేంద్ర పథకాలను అద్భుతంగా అమలు చేయడం, విభిన్న రంగాల్లో ఉత్తమ ప్రదర్శనల ద్వారా మంచి ఫలితాలు రాబట్టారు. రెండేళ్లలో జిల్లా అభివృద్ధిని ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రక్తహీనత నివారణకు ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లా సామాజిక బాధ్యత పథకం కింద ‘అక్షజ’ అనే ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని ఆదివాసీ మండలాల్లో ప్రారంభించారు. దీని కింద గర్భిణులు, మాతాశిశు ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..