Street Homeless: అక్కా.. వచ్చి నన్ను తీసుకెళ్లు!
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:33 AM
అయ్యా.. మా అక్కకి నేనంటే చాలా ఇష్టం. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో బృందావన్ అపార్టుమెంట్‌లో ఉంటుంది.
అలిపిరిలో అనాథలా నెల్లిమర్ల వాసి
తిరుపతి, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): ‘అయ్యా.. మా అక్కకి నేనంటే చాలా ఇష్టం. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో బృందావన్ అపార్టుమెంట్‌లో ఉంటుంది. తిరుపతిలో ఇట్లా రోడ్డు పక్కన పడి ఉన్నానని చెప్పండి.. వచ్చి తీసుకువెళ్తుంది.. ఎట్లయినా నన్ను మా అక్క దగ్గరకి చేర్చండి’ అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు తిరుపతిలోని అలిపిరి సమీపంలో పేవ్‌మెంట్ మీద ఎముకల పోగులా పడి ఉన్న 60 ఏళ్ల వ్యక్తి. నెలన్నరగా అతను ఎండకీ, వానకీ అక్కడే పడిఉన్నాడు. అలిపిరిలో అనాథలకు సేవ చేసే సుజాత అతని పరిస్థితి చూసి రోజూ అన్నం పెడుతున్నారు.
అన్నీ ఒంట్లోనే పోతుండడంతో తన కుమారుడి సాయంతో ఆమె శుభ్రం చేస్తోంది. వారి సపర్యలతో కాస్త కోలుకున్న తర్వాత ఆ వ్యక్తి తన వివరాలు చెబుతున్నాడు. తన పేరు కోరుమెల్లి వెంకట్రావు అని, తానొక హార్డ్‌వేర్ ఇంజనీరునని, విశాఖపట్నంలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేశానని చెప్పాడు. భార్యా పిల్లలు లేరని, నెల్లిమర్లలో తన అక్క అరుణ పాటక్ ఉంటుందని చెబుతున్నాడు.
తిరుమలకు దర్శనం కోసం ఒక్కడినే వచ్చానని.. అన్నదాన సత్రం దగ్గర హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయానని తెలిపాడు. అంబులెన్సులో తిరుపతి రుయా ఆసుపత్రికి పంపారని, తన వివరాలు చెప్పలేకపోవడంతో రెండ్రోజుల తర్వాత బయటకు పంపేశారన్నాడు. కదల్లేని స్థితిలో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులెవరైనా గుర్తించి తీసుకువెళ్లాలని ఆయనకు సేవ చేస్తున్న సుజాత కోరుతున్నారు.