Speaker Ayyanna: ప్రజాస్వామ్యానికి ప్రాణం సమర్థ పాలన
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:27 AM
స్వాతంత్య్రం ద్వారా మనకు స్వేచ్ఛ లభించినా, ప్రతి ఒక్కరూ తమ బాధ్యత తెలుసుకుని, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ సమాజాభ్యున్నతికి కృషి...
స్పీకర్ అయ్యన్న
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం ద్వారా మనకు స్వేచ్ఛ లభించినా, ప్రతి ఒక్కరూ తమ బాధ్యత తెలుసుకుని, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ సమాజాభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్.. జాతిపిత మాహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ప్రాణం సదుపాయాలు కాదని, సమర్థ పాలన అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీ సమావేశాలకు కొంత మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఇకనైనా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, అధికారులు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులందరికీ పథకాలు అందాలి: సీఎస్
అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. అమరావతి సచివాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలోని పేదల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా అందేలా మనందరం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. స్వర్ణాంధ్ర పి4 ఫౌండేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు.