Share News

Nara Lokesh: విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు

ABN , Publish Date - May 21 , 2025 | 04:47 AM

రాష్ట్రంలో విద్యా సంస్కరణలతో మ్యాజిక్‌ జరుగుతోందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘షైనింగ్‌ స్టార్స్‌’గా నిలిచిన పదో తరగతి టాపర్లను సన్మానిస్తూ, విద్యార్థులతో సరదాగా మమేకమయ్యారు.

Nara Lokesh: విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు

కఠిన సవాళ్లు ఎంచుకుంటేనే ఉన్నత శిఖరాలు

ఇక ప్రభుత్వ ఫలితాలపై పత్రికా ప్రకటనలు

టెన్త్‌ టాపర్ల సన్మాన కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌

మంత్రి లోకేశ్‌తో సన్మానం ఊహించలేదు

షైనింగ్‌ స్టార్స్‌-2025లో విద్యార్థుల స్పందన

అమరావతి, మంగళగిరి, మే 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో మ్యాజిక్‌ జరుగుతోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోందన్నారు. ‘షైనింగ్‌ స్టార్స్‌’ పేరుతో.. పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 47 మంది విద్యార్థులను మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సన్మానించారు. ప్రముఖులు రచించిన తొమ్మిది రకాల పుస్తకాలను వారికి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులున్నా తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలి. అనేక సవాళ్లు ఉన్నా విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం. నేడు మీరు సాధించిన విజయంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఏపీ విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రభుత్వ ఫలితాలపై పేపర్లలో ప్రకటనలు జారీచేస్తాం. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే కఠినమైన లక్ష్యాలనే ఎంచుకోవాలి. జీవితంలో అనేక పరీక్షలుంటాయి. పరీక్షలను సవాలుగా తీసుకునేవారే విజేతలుగా నిలుస్తారు. జూన్‌ నెలాఖరుకు విద్యా సంస్కరణలు పూర్తిచేస్తాం’’ అని మంత్రి అన్నారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ... విద్య ద్వారా మాత్రమే సమాజంలో కఠిమైన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.


నేను అల్లరి బ్యాచ్‌!

విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ సరదాగా సమాధానాలు చెప్పారు. మీరు చదువుకునేటప్పుడు పాఠశాలలో పరీక్షలు కష్టంగా ఉన్నాయా? అసెంబ్లీలో ప్రశ్నలు కష్టంగా ఉన్నాయా? అని సంతోష్‌ అనే విద్యార్థి ప్రశ్నించగా... ‘రెండూ కష్టమైనవే. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో మూడు ప్రశ్నలు వచ్చాయి. వాటికి సమాధానం చెప్పేందుకు ఎంతో ప్రిపేర్‌ కావాల్సి వచ్చింది. పాఠశాల రోజుల్లో నేను లాస్ట్‌ బెంచ్‌ విద్యార్థిని. అల్లరి బ్యాచ్‌ కూడా’ అని సమాధానమిచ్చారు. అదృష్టాన్ని నమ్ముతారా? కష్టాన్ని నమ్ముతారా? అని ఓ విద్యార్థి ప్రశ్నించగా ఉన్నత స్థానాలకు చేరాలంటే కష్టానికి మించిన ప్రత్యామ్నాయం లేదని, ఈ విషయంలో మోదీ, చంద్రబాబు నుంచి ప్రేరణ పొందానని అన్నారు.

మరెన్నో మెడల్స్‌ అందుకుంటా

మంత్రి లోకేశ్‌ గారి చేతుల మీదుగా మెడల్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరెన్నో పతకాలను సాధిస్తాను. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ బోధన బాగుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాలన్నది నా లక్ష్యం. అలాగే, యూపీఎస్సీ సాధించి ప్రజలకు సేవ చేయాలనీ ఉంది.

- కె.జోషిత, 597 మార్కులు, హరిపురం, శ్రీకాకుళం జిల్లా


ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధన

ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధనతోపాటు మెరుగైన వసతులు అందుతున్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో నాణ్యత, రుచి పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్వాలిఫైడ్‌ టీచర్స్‌ ఉంటారని మా మార్కుల ద్వారా రుజువైంది. అమ్మా నాన్నలు కూడా గర్వంగా ఫీలవుతున్నారు. మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా సన్మానం ఊహించలేదు. లోకేశ్‌ ప్రోత్సాహంతో తర్వాతి తరం విద్యార్థులు స్ఫూర్తి పొందుతారు. ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం.

- అంగడి పావని చంద్రిక, 598 మార్కులు, జడ్పీ హైస్కూల్‌, ఒప్పిచర్ల, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 04:48 AM