AP liquor scam: మద్యం ముడుపుల గుట్టు రట్టు
ABN , Publish Date - May 29 , 2025 | 04:19 AM
వైసీపీ హయాంలో జరిగిన ₹3,500 కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక మలుపు వచ్చింది. ఈడీ విచారణలో ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముడుపుల మార్గాలు, అసలు లబ్ధిదారుల వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
స్కామ్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన కసిరెడ్డి
ఆధారాలు ముందుపెట్టి రాబట్టిన ఈడీ
బెజవాడ జైలులో ప్రశ్నించిన అధికారులు
ఆ ముడుపులు చేర్చింది ఎక్కడికి?
స్కామ్‌లో అంతిమ లబ్ధిదారు ఎవరు?
7 గంటలపాటు 100 ప్రశ్నలు
నాకేం సంబంధమంటూ తొలుత కసిరెడ్డి బుకాయింపు
లావాదేవీలు చూపడంతో నోరు విప్పిన ఏ1
త్వరలో అసలు దొంగ బయటికి?
అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో దర్యాప్తు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్‌లో ముడుపులు ఎక్కడికి చేరాయి? ‘అంతిమ లబ్ధిదారు’ ఎవరన్నది పక్కా ఆధారాలతో సహా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపుగా తేల్చేసింది. ప్రభుత్వ మద్యం షాపుల పాలసీ పేరిట నాసిరకం మద్యం అమ్మించి, పేదల నుంచి పిండుకుని దాచుకున్న అసలు దొంగకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో కలసి ఈడీ ఉచ్చు బిగిస్తోంది. జగన్ పాలనలో లిక్కర్ పాలసీ నుంచి రిటైల్ విక్రయాల వరకూ.. ముడుపుల వసూళ్ల నుంచి అంతిమ లబ్ధిదారుకు చేర్చడం వరకూ అన్నింట్లో చక్రం తిప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(ఏ-1)ని విజయవాడ జైలులో ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం 9 గంటలకు జైల్లోకి ప్రవేశించిన అధికారులు వందకు పైగా ప్రశ్నలు సంధించారు. 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ప్రశ్నించారు. మొదట ‘నాకేం సంబంధం’ అంటూ బుకాయించిన కసిరెడ్డి.. అధికారులు ఆర్థిక లావాదేవీలు చూపడంతో నోరు విప్పాడు. అంతిమంగా ముడుపులు ఎక్కడికి చేరాయో, అసలు దొంగ ఎవరో వెల్లడించినట్లు తెలిసింది.

విశ్వసనీయ సమాచారం మేరకు... మద్యం కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు జరిగిన తీరు మొదలుకొని ముడుపులు సేకరించిన విధానం, వాటిని మళ్లించిన దారుల వరకూ రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. డిస్టిలరీస్ నుంచి తీసుకున్న కమీషన్లు నగదు రూపంలో ఎంత? బంగారం రూపంలో ఎంత? దుస్తులు, ఇతర గిఫ్ట్‌ల ఇన్వాయి్‌సల ద్వారా ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేర్చింది? అనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రమోషనల్ గూడ్స్ రూపంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీలాండరింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన ఈడీ అధికారులు కొన్ని ఆధారాలు రాజ్ కసిరెడ్డి ముందుంచి ప్రశ్నించారు. ఇటీవల ముంబె ౖలో సిట్ అధికారులకు ఈడీ అధికారులు సహకరించారు. అప్పుడే ముడుపులు చేరిన మార్గం, అంతిమ లబ్ధిదారుడి గుట్టు తెలిసింది. ఆ తర్వాత విజయవాడకు వచ్చిన ఈడీ అధికారులు మొత్తం కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై సిట్ అందజేసిన ప్రత్యేక నోట్ ద్వారా లోతుపాతులు తెలుసుకుంది. రియల్ ఎస్టేట్ లింకులతో పాటు బినామీల ద్వారా బెంగళూరులో కొనుగోలు చేసిన భారీ ఆస్తుల వివరాలతో కూడిన ఐదు లేయర్ల డేటాను సమీక్షించుకున్న ఈడీ అధికారులు.. అందుకు అనుగుణంగా రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించారు. మద్యం స్కామ్‌లో రాజ్ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారు లు సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు ఎవరికి చేరాయో తేలిపోయింది.
ఈడీ ప్రశ్నల వర్షం
కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలను ఎక్కడికి చేర్చావ్ అని ఈడీ అధికారులు అడగ్గానే.. ‘నాకేంటి సంబంధం’ అంటూ ఏ1 మొదట్లో గట్టిగా మాట్లాడినట్టు తెలిసింది. కాసేపటి తర్వాత ఈడీ అధికారులు ఆధారాలు చూపడంతో గుటకలు మింగాడు. మూడున్నర వేల కోట్ల స్కామ్‌లో ఎక్కువ శాతం ముడుపులు ఎక్కడికి చేరాయో నెమ్మదిగా వెల్లడించినట్లు తెలిసింది. ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీలోకి మళ్లించారు? ఎవరు చెబితే చేశావ్? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు? అందులో బినామీలు ఎవరు? బంగారం కొన్నదెంత? కేవలం జీఎ్‌సటీ చెల్లించి బిల్లులు తీసుకున్నది ఎంత? స్థిరాస్తి వ్యాపారులు ఎవరెవరు సహకరించారు? ఇతర బిజినె్‌సమెన్లు ఎవరున్నారు.. ఇలా ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్ కసిరెడ్డి మొండికేసిన ప్రతి చోటా ఆధారాలు చూపించి గుట్టు రాబట్టినట్లు తెలిసింది. వేల కోట్ల రూపాయలు దాచుకున్న అసలు దొంగ ఎవరో గుట్టు విప్పినట్లు సమాచారం. ముడుపుల రూటింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి వెళ్లింది ఎంత? బినామీల ద్వారా భారీగా కొనుగోలు చేసిన ఆస్తులు ఎన్ని?.. ముడుపుల సొమ్ము వెళ్లిన దారులు, హవాలా జరిగిన విధానం, అంతిమంగా లబ్ధిపొందిన వ్యక్తి ఎవరో అతి త్వరలో బయటికి రాబోతోంది.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News