Share News

బీటెక్‌ మానేసి ఏటీఎమ్‌ల వద్ద చోరీలు

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:32 AM

అనపర్తి, డిసెంబరు 17 (ఆంధ్ర జ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై కారు లో తిరుగుతూ జల్సాలు చేయాలన్న కోరికతో బీటెక్‌ను మధ్యలోనే ఆపి ఏటీఎమ్‌ సెంటర్ల వ

బీటెక్‌ మానేసి ఏటీఎమ్‌ల వద్ద చోరీలు
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎఎస్పీ విద్య

అనపర్తిలో నెల్లూరుకు చెందిన యువకుడి అరెస్ట్‌

నిందితుడిపై 12 కేసులు

కారు, 10 ఏటీఎం కార్డులు, రూ.3వేల నగదు స్వాధీనం

అనపర్తి, డిసెంబరు 17 (ఆంధ్ర జ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై కారు లో తిరుగుతూ జల్సాలు చేయాలన్న కోరికతో బీటెక్‌ను మధ్యలోనే ఆపి ఏటీఎమ్‌ సెంటర్ల వద్ద నేరాల బాట పట్టిన నెల్లూరుకు చెందిన కందుకూరు ఫణీంద్ర అనే యువకుడిని మంగళవారం అనపర్తిలో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ సెంటర్‌ వద్ద అనపర్తి ఎస్‌ఐ శ్రీనునాయక్‌ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. అతడి నుంచి కారు, 10 ఏటీఎమ్‌ కార్డులు, రూ.3వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబ ంధించిన వివరాలను బుధవారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో రాజమహేంద్రవరం ఈస్ట్‌ జోన్‌ డీఎస్పీ బి.విద్య వివరించారు.

సులువుగా డబ్బు సంపాదించాలని..

నెల్లూరుకు చెందిన కందుకూరు ఫణీంద్ర చెడు వ్యసనాలకు బానిసై కారులో తిరుగుతూ జాల్సాలు చేయాలని భావించి బీటెక్‌ చదువును మధ్యలోనే నిలిపి నేరాల బాట పట్టాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న కోరికతో ఏటీ ఎమ్‌ల వద్ద సొమ్ములు విత్‌ డ్రా చేసుకునేందు కు వచ్చే వృద్ధులు, నిరక్ష్యరాస్యులను టార్గెట్‌గా చేసుకునేవాడు. వారిని మాయలో పడేసి పిన్‌ తెలుసుకుని సులువుగా ఏటీఎమ్‌ కార్డులను మా ర్చి తరువాత వారి ఖాతాల నుంచి సొమ్ములను చోరీ చేయడం అలవాటు చేసుకున్నాడు. 2017 నుంచి 2020 వరకు వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడడంతో అతడిపై 7 కేసులు నమోదు కాగా జైలుకు వెళ్లి వచ్చాడు. తరువాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. 2024లో రెండు చోట్ల, 2025లో మూడు చోట్ల ఇదే తరహా నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నాడు. 2024లో అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సిద్దాబత్తుల ముత్యాలు అనపర్తి కెనాల్‌రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎమ్‌ వద్ద డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లడంతో అతడిని మాటల్లో పెట్టి కార్డు మార్చి రూ.35వేలు చోరీ చేయడంతో అనపర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం కెనాల్‌ రోడ్డు లో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ వద్ద ఫణీంద్ర కదలికలు అనుమానంగా ఉండడంతో ఎస్‌ఐ శ్రీను నాయక్‌ అతడిని ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నేరాలు బయపడ్డాయని డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి కారు, 10 ఏటీఎమ్‌ కార్డులు, రూ.3వేలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ సుమంత్‌, ట్రైనీ ఎస్‌ఐ సుజాత, అడిషనల్‌ ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 12:32 AM