మీ డబ్బు-మీ హక్కు పేరుతో ప్రచారం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:36 AM
వివిధ బ్యాంకుల్లో లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లోని తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వివరించారు. ‘మీ డబ్బు-మీహక్కు నినాదంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంపై సోమవారం కలెక్టర్ గోడ పత్రికను బ్యాంకు అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ములు తిరిగి పొందేందుకు వెసులుబాటు
ప్రచార పోస్టర్లను విడుదల చేసిన కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వివిధ బ్యాంకుల్లో లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లోని తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వివరించారు. ‘మీ డబ్బు-మీహక్కు నినాదంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంపై సోమవారం కలెక్టర్ గోడ పత్రికను బ్యాంకు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పదేళ్లు అంతకు మంచి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్ములను బ్యాంకులు తిరిగి ఇవ్వడానికి నిర్ణయించాయని కలెక్టర్ పేర్కొన్నారు. దీని ద్వారా ఖాతాదారుల పేరు మీద ఉన్న క్లెయిమ్ చేయని, లేదా మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేందుకు అవకాశం కలిగిందన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా పాలసీలు, ఇతర పెట్టుబడులు పెట్టడం ద్వారా స్తంభించిఉన్న ఖాతాల్లోని సొమ్ములను తీసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. బ్యాంకు అధికారులకు సరైన పత్రాలు సమర్పించడం ద్వారా వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలో 4,70,690 బ్యాంకు ఖాతాల్లో రూ.82.66 కోట్లు ఉన్నాయని వీటిలో వ్యక్తిగత ఖాతాలు 4,58,644 ఉండగా, వీరి ఖాతాల్లో రూ.66.27 కోట్లు ఉన్నాయని, సంస్థాపరమైన 6,984 ఖాతాలు ఉండగా, ఈ ఖాతాల్లో రూ.12.26 కోట్లు ఉన్నాయని, ప్రభుత్వ రంగంలో 5,062 బ్యాంకు ఖాతాల్లో రూ.4.13 కోట్లు ఉన్నాయని, వీటికి సంబంధించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు సరైన పత్రాలతో ఈకేవైసీ పూర్తిచేసి తమ సొమ్మును తిరిగి పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా లీడ్ బ్యాంకు అధికారి కేశవవర్మ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.