Share News

యోగా.. జీవితంలో భాగం కావాలి

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:12 AM

ప్రభుత్వం ప్రతిరోజూ ప్రతిఒక్కరికీ యోగాపై అవగాహన కల్పిస్తోందని, మనందరి జీవితాల్లో యోగా భాగమై ఉండాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కరవనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమం శుక్రవారం జరిగింది.

యోగా.. జీవితంలో భాగం కావాలి
లాలాచెరువులోని గోదావరి మహా పుష్కరవనంలో యోగా సాధన చేస్తున్న దృశ్యం

  • కలెక్టర్‌ ప్రశాంతి

  • యోగాపై ప్రతిఒక్కరికి అవగాహన అవసరం: ఎమ్మెల్సీ సోము

దివాన్‌చెరువు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిరోజూ ప్రతిఒక్కరికీ యోగాపై అవగాహన కల్పిస్తోందని, మనందరి జీవితాల్లో యోగా భాగమై ఉండాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కరవనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమం శుక్రవారం జరిగింది. కలెక్టర్‌ ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని సాధకులతో బాటు యోగాసనాలు వేశారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజులుగా వివిధ వర్గాల ప్రజలతో ప్రభుత్వ శాఖల వారీ నిర్వహించిన ప్రచార కార్యక్రమం శుక్రవారం ముగిసిందన్నారు. యోగా చేస్తే ప్రశాంతంగా, బ్యాలెన్స్‌గా, ఆరోగ్యంగా ఉంటారని, అందరూ తప్పనిసరిగా యోగ చేయాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేవిధంగా జిల్లా, నియోజకవర్గం, మున్సిపాల్టీల్లో, మండల, సచివాలయాల పరిధిలో వేడుకగా యోగా సాధన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక, క్షేత్రస్థాయి అధికారులను, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలను సిద్ధం చేశామన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉండాలని యోగాపై ప్రతిఒక్కరూ అవగాహన కల్పించుకుని ఆచరించే విధంగా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. పుష్కరవనంలో మంచి ఆక్సిజన్‌, ఆరోగ్యాన్నిచ్చే మొక్కలను పెంచుతున్నారన్నారు. రాజమహేంద్రవరం చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మూర్తి మాట్లాడుతూ రోజూ 20-30 నిమిషాలు యోగా చేస్తే ప్రతిఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో టి.సీతారామమూర్తి, జిల్లా అటవీ అధికారి వి.ప్రభాకరరావు, డీఐవో కోమలి, డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్‌ఎన్‌ మూర్తి, అటవీ అకాడమీ డైరెక్టర్‌ విజయకుమార్‌, ట్రైనీలు అల్లక ఇందిరాదేవి, వీరవేణి, స్నేహ పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 01:12 AM