Share News

యోగాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కార్యక్రమాలు

ABN , Publish Date - May 24 , 2025 | 01:05 AM

యోగాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నెల రోజులు అందరి భాగస్వామ్యంతో ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.

యోగాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కార్యక్రమాలు

అమలాపురం, మే 23(ఆంధ్రజ్యోతి): యోగాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నెల రోజులు అందరి భాగస్వామ్యంతో ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జూన్‌ 21న రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా ప్రతీరోజు ఉదయం 7నుంచి 8గంటల వరకు యోగా సాధన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయుష్‌ విభాగం యోగాశిక్షణ కార్యక్రమాల్లో యోగా గురువులు, మాస్టర్‌ ట్రైనీల ద్వారా ఐదేసి రోజుల పాటు శిక్షణలు ఇస్తామన్నారు. ఈనెల27న మాస్‌ మీడియాకు యోగాతో అనారోగ్యాన్ని జయించినా, యోగాసాధనతో విజయ తీరాలకు చేరిన కథనాలను విడుదల చేయాలని, అదేరోజున ప్రజా ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించాలన్నారు. ఈనెల 27, జూన్‌ 3,16 తేదీల్లో పర్యాటకుల ద్వారా యోగాంధ్రపై క్యాంపెయిన్‌ నిర్వహించాలన్నారు. ఈనెల28న మండలస్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని, జూన్‌ 2న రంగోళీ పోటీలు, 4న గ్రామ, మున్సిపల్‌ స్థాయిలో కార్యక్రమాలు, జూన్‌ 5నుంచి 7వరకు స్వయం సహాయక సంఘాలు, 13న రైతుల యోగా, 16న ఫ్యామిలీ యోగా, 17న స్పెషల్‌ యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో బీఎల్‌ఎన్‌ రాజకుమారి, సీపీవో వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌, ఆయుష్‌ మెడికల్‌ అధికారి విజయకుమారి, దేవదాయ ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ, డీఐపీఆర్వో కె.లక్ష్మీనారాయణ, డీఈవో డాక్టర్‌ షేక్‌సలీంబాషా, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 01:05 AM