యోగాయనమః
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:31 AM
యోగా.. నవనాడులను కదిలించేది. నవ యవ్వనంగా ఉంచేది. అనునిత్యం యోగా సాధనతో చక్కని ఆయుష్షు సొంతం. ఏ వయసులోనైనా ఆచరించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే ఒకటి కాదు.. రెండు కాదు.. ఓ ఉద్యమంలా.. ఉమ్మడి జిల్లాలో నెల రోజులపాటు సాగింది.
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
యోగా.. నవనాడులను కదిలించేది. నవ యవ్వనంగా ఉంచేది. అనునిత్యం యోగా సాధనతో చక్కని ఆయుష్షు సొంతం. ఏ వయసులోనైనా ఆచరించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే ఒకటి కాదు.. రెండు కాదు.. ఓ ఉద్యమంలా.. ఉమ్మడి జిల్లాలో నెల రోజులపాటు సాగింది. ఏ వీధి చూసినా.. ఏ వాడచూసినా యోగా కార్యకలాపాలే. అన్ని వర్గాలు ఏకమయ్యాయి. లక్షల మంది యోగా మంత్రాన్ని పఠించారు. యోగాతోనే ఆరోగ్యం.. యోగాతోనే ఆనందం అని ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల రోజుల స్ఫూర్తి నేటితో పతాకానికి చేరింది. వేలమంది ఇన్ని రోజుల స్ఫూర్తి నేడు రగిలి ప్రతి ఒక్కరిని యోగాంకితులుగా మార్చబోతోంది. నేడే ప్రపంచయోగా దినోత్సవం కావడంతో ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. వేలాది ఆసనాలతో పులకరించేందుకు సిద్ధమైంది. అటు విశాఖలో జరిగే నేటి యోగాదినోత్సవ వేడుకకు ఉద్యమమై కదిలింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. యోగాంధ్ర పేరిట గత నెలరోజులుగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న యంత్రాంగం శనివారం భారీ ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు పిలుపునిచ్చారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం విశాఖలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి పెద్దఎత్తున జనం తరలివెళ్లారు.
విశాఖకు బస్‌లు 635
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : విశాఖపట్నంలో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి 185 ఆర్టీసీ బస్సులు పంపించారు. జిల్లాలోని రాజమహేంద్రవరం డిపోతో పాటు కొవ్వూరు, గోకవరం, నిడదవోలు డిపోల నుంచి బస్సులను పంపించారు.జిల్లా నుంచి 450 ప్రైవేట్ బస్సులు తరలి వెళ్లాయి. ఈ బస్సులన్నీ శుక్రవారం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకున్నాయి. అక్కడి జిల్లా అధికారులకు బస్సులను అప్పగించారు. ఉదయం ఆర్‌కే బీచ్ నుంచి భీమిలి వరకూ జరిగే యోగాభ్యసనాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చే వారి కోసం ఈ బస్సులను కేటాయించనున్నారు. యోగాభ్యసనాల కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత వారిని వారి గమ్యస్థానాలకు చేరవేసి తిరిగి జిల్లాకు చేరుకుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
తరలిన ఉద్యోగులు
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : విశాఖపట్నంలో శనివారం భారీస్థాయిలో నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారని డీఎంహెచ్‌వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. రెండు బస్సుల్లో మొత్తం 72 మంది వైద్య సిబ్బందిని పంపించడం జరిగిందన్నారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ కోమల జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.మొత్తం 24 మంది వైద్యులు, 24 మంది స్టాఫ్‌నర్సులు, 24 మంది ఫార్మసిస్టులు యోగాంధ్రలో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలు శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పోలీసులు బందోబస్తు నిమిత్తం వెళ్లారు. శనివారం రాజమహేంద్రవరంలోని ఏకేసీ కళాశాల వద్ద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో ఆరోగ్యసిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. డీపీఎంవో డాక్టర్ శ్రీవల్లి, ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ కె.సుధాకర్, డిప్యూటీ డెయో సత్యకుమార్, జిల్లా ఎపిడమాలజిస్ట్ సుధీర్, సీహెచ్‌వో శర్మ, తదితరులు పాల్గొన్నారు.
నేడు యోగాసనాలకు 10 వేల మంది
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి శనివారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని జీఎన్‌టీ రోడ్డును సిద్ధం చేశారు. యోగా సాధనకు లాలాచెరువు సూర్యనమస్కారాల పార్కు వద్ద నుంచి సెంట్రల్ జైలు వరకూ సుమారు 10 వేల మందితో యోగాసనాలు వేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి 200 మీటర్లకు చిన్నవేదిక ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో పాల్గొంటున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసినట్టు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
8.79 లక్షల మంది రిజిస్ట్రేషన్ : కలెక్టర్
జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి వెల్లడించారు.ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం పడితే యోగా సాధనకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 7,71,037 మంది యోగాంరఽధ పోర్టల్‌లో రిజిస్ర్టేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 8,79,923 మంది రిజిస్ర్టేషన్ చేసుకోవడం జరిగిందన్నారు.