సొంతింటి కల సాకారం చేయాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:01 AM
పేదలు నిర్మించుకునే ఇంటికి రూ.10లక్షలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు పేర్కొన్నారు.

ముమ్మిడివరం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): పేదలు నిర్మించుకునే ఇంటికి రూ.10లక్షలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం సీపీఐ ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహించింది. తొలుత ప్రచారజాతా కార్యక్రమాన్ని శీలం వెంకటేష్, జనిపల్లి శివాజీ ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణంలో రెండు సెంట్ల స్థలాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో చాలా మంది పేదలు ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారందరికీ ఇళ్లస్థలాలు కేటాయించాలని సత్తిబాబు డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా పేదల సమస్యలను ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ముందు ఉంచాలన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారందరికీ ఇంటి నిర్మాణానికి సాయం అందించాలన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎం.శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారని, ఆయన పేదల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారిపక్షాన నిలబడతారని ఆశాభావం వ్యక్తంచేశారు. వనచర్ల విజయ్‌కుమార్, కుమ్మరి వెంకటేశ్వరరావు, జగడం పాపాయమ్మ, సానబోయిన మనోహర్, పీఎస్‌ఎన్ రాజు, జి.వర్మ, మడికి మహాలక్ష్మి, దిగుమర్తి విజయ్, ఎం.మహేష్‌పాల్గొన్నారు.