Share News

అర్ధరాత్రి హత్య

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:36 AM

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడి గ్రామం బైపాస్‌ రోడ్డులో మెట్ల రాంజీ కాలనీలో డాక్టర్‌ బాబూజగ్జీవన్‌రామ్‌ కల్యాణ మండపం సమీపంలో దొమ్మేటి రాంబాబు (61), భార్య వెంకటరమణ తో సొంతింట్లో జీవించేవాడు

అర్ధరాత్రి హత్య

విడాకులు తీసుకుని కుమార్తె పెళ్లి కోసం కలిసిన జంట

భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం

రోజు మద్యం మత్తులో వీడియో కాల్‌

కోపంతో భర్త తలపై ఇనుపరాడ్‌తో బలంగా కొట్టి చంపిన భార్య

వివాహమై ఆడబిడ్డ పుట్టిన తరువాత భార్యాభర్తలిద్దరికీ పొసగలేదు. దాంతో విడాకులు తీసుకుని విడిపోయారు. కానీ కుమార్తె పెళ్లిలో కన్యాదానం కోసం పెద్దల మాట విని మళ్లీ కలుసుకున్నారు. అయితే భర్త రోజు రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకుని వేరే మహిళకు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్నాడనే కోపంతో అర్ధరాత్రి కిరాతకంగా కొట్టి చంపింది భార్య. ఈ సంఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నడిపూడిలో జరిగింది.

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడి గ్రామం బైపాస్‌ రోడ్డులో మెట్ల రాంజీ కాలనీలో డాక్టర్‌ బాబూజగ్జీవన్‌రామ్‌ కల్యాణ మండపం సమీపంలో దొమ్మేటి రాంబాబు (61), భార్య వెంకటరమణ తో సొంతింట్లో జీవించేవాడు. రాంబాబు కాకినాడ హెడ్‌ క్వార్టర్‌ స్క్వాడ్‌లో ఆర్టీసీ బస్సుల తనిఖీ అధికారిగా పనిచేస్తున్నాడు. రాంబాబు, వెంకటరమణ కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. వారికి కుమార్తె హేమ జన్మించింది. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. హేమ తండ్రి వద్దనే ఉంది. విడిపోయిన భార్య వెంకటరమణ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశానికి వెళ్లి కొంతకాలం పనిచేసుకుని తిరిగి స్వదేశానికి చేరుకుంది. కాలక్రమంలో కుమార్తె హేమకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. దాంతో విడిపోయిన భార్యభర్తలు కలిసి కన్యాదానం చేయించాల్సిన పరిస్థితిపై రాంబాబు కుటుంబసభ్యులు చర్చించుకున్నారు. దాంతో పెద్దల సమక్షంలో కలిసి కుమార్తె వివాహాన్ని జరిపించారు. కుమార్తె నరాల హేమ కుటుంబం ప్రస్తుతం చెన్నైలో జీవిస్తున్నారు.

ఒకే ఇంట్లో ఉన్నా కానీ...

ఈ నేపథ్యంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నప్పటికీ ఒకే ఇంట్లో దూరంగా ఉంటున్నారు. రాంబాబు భోజనాన్ని కూడా బయట నుంచి తెచ్చుకుని తినేవాడు. అతడు గత కొంతకాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రోజు రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకుని వేరే మహిళకు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్న తీరుపై వెంకటరమణ కక్ష పెంచుకుంది. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న రాంబాబు 12 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడినట్టు చెప్తు న్నారు. ఆ తరువాత మద్యం మత్తులో మంచంపై పడి ఉన్న రాంబాబును భార్య వెంకటరమణ ఇనుపరాడ్‌తో తలపై బలంగా మోదడంతో చనిపోయాడు. శుక్రవారం ఉదయం బంధువులకు ఫోన్‌ చేసి గుండెపోటుతో రాంబాబు మృతిచెందినట్టు భార్య సమాచారం ఇచ్చింది. నడిపూడి చేరుకున్న బంధువులు మృతదేహం పడి ఉన్నతీరు, మంచం నిండా రక్తం మరకలు గుర్తించి వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌, ఎస్‌ఐ వై.శేఖర్‌బాబు సిబ్బందితో కలిసి శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భార్య వెంకటరమణ తలపై ఇనుపరాడ్‌తో బలంగా మోదడం వల్లే రాంబాబు మృతిచెందినట్టు గుర్తించారు. రావులపాలేనికి చెందిన మృతుడికి కుమారుడు వరుసైన దొమ్మేటి నాగసురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఇది ఒక్కరి పనేనా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీమ్‌, డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించిన ట్టు తాలూకా ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 06 , 2025 | 12:36 AM