Share News

టీడీపీ కోసం పనిచేసే వారికే పట్టం కడతాం

ABN , Publish Date - May 19 , 2025 | 12:41 AM

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టించి పనిచేసిన పార్టీ నేతలను, కార్యకర్తలను గుర్తించి తగు రీతిలో వారికి అవకాశాలు కల్పిస్తామని టీడీపీకి చెందిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు.

  టీడీపీ కోసం పనిచేసే వారికే పట్టం కడతాం

నియోజకవర్గ స్థాయి మహానాడులో

ఎమ్మెల్యే ఆనందరావు ఫ భారీగా హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలుఫ పలు

తీర్మానాలు ఆమోదించిన సమావేశం

అమలాపురం, మే 18(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టించి పనిచేసిన పార్టీ నేతలను, కార్యకర్తలను గుర్తించి తగు రీతిలో వారికి అవకాశాలు కల్పిస్తామని టీడీపీకి చెందిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను సంస్థాగతంగాను, వివిధ నామినేటెడ్‌ పదవుల్లోను నియమించడానికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. అమలాపురం పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో గల టీడీపీ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ స్థాయి మహానాడును ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనందరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అమలాపురం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే పంటకాల్వపై ఈదరపల్లి-నడిపూడి వద్ద రెండు వంతెనలు నిర్మిస్తున్నామని, రానున్న రోజుల్లో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని చోట్ల వారధులు నిర్మించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమలాపురం పట్టణంలో అభివృద్ధికి నోచుకోలేదని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత పట్టణాన్ని అన్ని రంగాల్లోను అభివృద్ధి చేస్తున్నానన్నారు. నియోజకవర్గ స్థాయిలో టీడీపీ, వివిధ అనుబంధ సంస్థలకు చెందిన ప్రతినిధులు చేస్తున్న కృషిని అటు పార్టీ, ఇటు తాను గుర్తించడం జరుగుతుందని, సమయం వచ్చినప్పుడు అందరికీ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈనెల22న అమలాపురంలో జిల్లా స్థాయి మినీ మహానాడు నిర్వహించడానికి పార్టీ నిర్ణయించిందని, ఆ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆనందరావు పిలుపునిచ్చారు. అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు మాట్లాడుతూ అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందనడానికి తానే ఒక ఉదాహరణగా పేర్కొంటూ ప్రతీ ఒక్కరూ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆనందరావును అభినందించడంతో పాటు రానున్న రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించారు. డీసీఎంఎస్‌ అధ్యక్షుడు పెచ్చెట్టి చంద్రమౌళి మాట్లాడుతూ టీడీపీని వీడకుండా పనిచేసేవారికి పార్టీ పట్టం కడుతుందనడానికి తనకు లభించిన పదవే ఉదాహరణ అని, ప్రతీ ఒక్కరూ చంద్రబాబు, లోకేష్‌ నాయకత్వంలో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గస్థాయిలో హాజరైన పార్టీ మండల అధ్యక్షులు, వాటి అనుబంధ సంస్థల ప్రతినిధులు టీడీపీఅభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇస్తూ ప్రసంగాలు చేశారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, మండల అధ్యక్షుడు మల్లుల పోలయ్య, అల్లవరం మండలాధ్యక్షుడు దంతులూరి సత్తిబాబురాజు, టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ అధికారి జయవెంకటలక్ష్మి, టీడీపీ నేతలు నిమ్మకాయల సూర్యనారాయణ, నల్లా స్వామి, పొలమూరి ధర్మపాల్‌, బొర్రా ఈశ్వరరావు, చింతా శంకరమూర్తి, అరిగెల నానాజీ, మాకిరెడ్డి పౌర్ణిమ, నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన వివిధ అనుబంధ సంస్థల పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు.

పలు తీర్మానాలు ఆమోదం..

అమలాపురం నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ తాగునీరు అందేలా కుళాయిలు ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రమైన అమలాపురంలో రోడ్లను విస్తరించి పునర్నిర్మించాలి. సీఎం ఇచ్చినహామీ మేరకు అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఐటీఐ కళాశాలను మంజూరు చేయాలని నియోజకవర్గస్థాయి సమావేశం తీర్మానించింది. పీ4 విధానంలో వైద్య కళాశాల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. కోటిపల్లి-ముక్తేశ్వరం వంతెన నిర్మించాలి. జిల్లాను టూరిజం హబ్‌గా ప్రకటించి ప్రాజెక్టులు నెలకొల్పాలి. ఏదైనా యూనివర్శిటీని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతూ సమావేశం తీర్మానించినట్టు ఎమ్మెల్యే ఆనందరావు ప్రకటించారు.

Updated Date - May 19 , 2025 | 12:41 AM