తాగునీటి సమస్యను పరిష్కరించండి
ABN , Publish Date - May 17 , 2025 | 12:50 AM
శివారు గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ డిమాండ్ చేశారు.
ఉప్పలగుప్తం, మే 16(ఆంధ్రజ్యోతి): శివారు గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ముఖ్య కార్యకర్తలతో కలిసి మండలంలోని శివారు గ్రామాల్లో పర్యటించి తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించారు. మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గొల్లవిల్లిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నెల రోజులుగా చాలా గ్రామాలకు అరకొరగా తాగునీరు సరఫరా చేస్తున్నారని అన్నారు. చల్లపల్లి ప్రాజెక్టు పరిధిలో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్న తాగునీరు కొంతకాలంగా వారానికి రెండు రోజులు మాత్రమే సరఫరా జరుగుతున్నట్టు వ్యాఖ్యానించారు. గొల్లవిల్లి ఎన్టీఆర్ కాలనీకి నెలల తరబడి తాగునీటి కొరత ఉన్నా పంచాయతీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు వద్ద పంపింగ్ సక్రమంగా లేక పంచాయతీ ట్యాంకులు నిండటంలేదన్నారు. ఈఅంశంపై అధికారులను నిలదీయవలసిని పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని లోక్ ఆరోపించారు. తాగునీటి సరఫరాలో లోపాలను సవరించి అందరికీ నీరంచాలని విజ్ఞప్తి చేశారు.