Share News

విలేజ్‌లకు..టౌన్‌ లుక్‌!

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:28 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీరాజ్‌శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది.

విలేజ్‌లకు..టౌన్‌ లుక్‌!

జిల్లాలో 18 రూర్బన్‌ పంచాయతీల గుర్తింపు

ప్రత్యేక సిబ్బంది నియామకం.. మౌలిక వసతులపై దృష్టి

అమలాపురంరూరల్‌, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీరాజ్‌శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. దశాబ్ధాల కాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను చేపట్టి అందరి మన్ననలు పొందింది. ఇదిలా ఉండగా పంచాయతీల్లో పట్టణ తరహా సేవలు ప్రజలకు అందించేందుకు కొత్త విధానానికి రూపకల్పనచేసి కేబినేట్‌ ఆమోద ముద్ర పొందింది. తద్వారా మరింత మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్లస్టర్‌ వ్యవస్థను రద్దుచేసి గ్రామ పంచాయతీలను స్వతంత్ర ప్రతిపత్తి గల స్థానిక సంస్థలుగా మార్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా పంచాయతీల్లోను, పట్టణ తరహా సేవలు అందించనున్నట్టు ప్రకటించింది. అత్యధిక ఆదాయం, అత్యధిక జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను ఇకపై రూర్బన్‌ పంచాయతీలుగా మారనున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు జిల్లాలో 18 రూర్బన్‌ పంచాయతీలను గుర్తించారు. పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు.. ఇలా జనాభా ప్రాతిపదికన వర్గీకరణ ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త వర్గీకరణ ద్వారా పెద్ద పంచాయతీలను ప్రత్యేక కేటగిరీ కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పది వేలమందికిపైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను ‘రూర్బన్‌’ పంచాయతీలుగా గుర్తించారు. అదేవిధంగా రూ.కోటికి పైగా ఆదాయం కలిగిన పంచాయతీలు కూడా ఇదే కేటగిరి కిందకు వస్తాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ తీసుకున్న నిర్ణయం మేరకు రూర్బన్‌ పంచాయతీల్లో పట్టణ తరహా సేవలు అందించనున్నారు. పురపాలక సంఘాల మాదిరిగానే రూర్బన్‌ పంచాయతీల్లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రణాళిక, ప్రజారోగ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంజనీరింగ్‌ విభాగాలు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నారు. ఆయా విభాగాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకోవచ్చు. ఇల్లు, భవన నిర్మాణాలకు అనుమతులు, అక్రమ నిర్మాణాల నియంత్రణకు పురపాలక సంఘం మాదిరిగానే కంట్రీప్లానింగ్‌ విభాగాన్ని ఏర్పాటుచేయనున్నారు. సచివాలయాల్లో అధికంగా ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు, రూర్బన్‌ పంచాయతీల్లో గ్రామీణ ప్లానింగ్‌ అసిస్టెంట్లుగా నియమించి విధులను అప్పగిస్తారు.

జిల్లాలో 18 రూర్బన్‌ పంచాయతీలు

జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో అత్యధిక ఆదాయం, జనాభా కలిగిన 18 గ్రామాలను రూర్బన్‌ పంచాయతీలుగా గుర్తించారు. వాటిలో అమలాపురం రూరల్‌ మండలం బండారులంక, పేరూరు, కామనగరువు, అంబాజీపేట మండలం మాచవరం, అల్లవరం మండలం కొమరగిరిపట్నం, ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, కాట్రేనికోన, కొత్తపేట మండలంలో వానపల్లి, కొత్తపేట గ్రామాలు, మండపేట మండల పరిధిలో ఏడిద, కేశవరం, ద్వారపూడి, రావులపాలెం మండలం రావులపాలెం, రాయవరం మండలం చెల్లూరు, రాజోలు మండలం తాటిపాక, రాజోలు గ్రామాలను రూర్బన్‌ పంచాయతీలుగా గుర్తించారు. వీటితో పాటు 3వేలకు పైగా 10వేలలోపు జనాభా కలిగి రూ.30లక్షల నుంచి రూ.కోటి ఆదాయం కలిగిన పంచాయతీలను గ్రేడ్‌-1గాను, 2వేల నుంచి 3వేలలోపు జనాభా కలిగిన సొసైటీలను గ్రేడ్‌-2గాను, 2వేలలోపు జనాభా కలిగిన పంచాయతీలను గ్రేడ్‌-3గా గుర్తించే పనిలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నిమగ్నమై ఉంది. అంతే కాకుండా పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారి పీడీవోగా పేరు మార్చనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సిబ్బందికి ఎప్ప టికప్పుడు పదోన్నతులు లభించనున్నాయి. ప్రధానంగా రూర్బన్‌ పంచాయతీల్లో డిప్యూటీ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిణి నియమిస్తారు. ఆయన కింద వివిధ కేటగిరిల్లో ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 18 , 2025 | 01:28 AM