గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - May 20 , 2025 | 01:09 AM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, గతంలో బకాయిలున్న ఆర్థిక సంఘం నిధులన్నీ త్వరలోనే విడుదలవుతాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.
అంబాజీపేట, మే 19(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, గతంలో బకాయిలున్న ఆర్థిక సంఘం నిధులన్నీ త్వరలోనే విడుదలవుతాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. అంబాజీపేట వాసవీ కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ నామన రాంబాబు అధ్యక్షతన నియోజకవర్గ మినీమహానాడు సోమవారం జరిగింది. ఈసందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అధోగతి పాలైన రాష్ర్టాన్ని సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈసమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలన్నింటిని ఈనెల 27, 28,29తేదీల్లో కడపలో జరిగే రాష్ట్ర స్థాయి టీడీపీ మహానాడులో ప్రవేశపెడతామన్నారు. ఈసందర్భంగా నియోజకవర్గ కోకన్వీనర్ దాసరి వీరవెంకట సత్యనారాయణ ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యంగా కార్పొరేషన్ రుణాలు విరివిగా మంజూరు చేయాలని, రైతులకు ఎరువుల రాయితీ ఇవ్వాలని, అప్పనపల్లి కాజ్‌వే నిర్మాణం చేపట్టాలని, బ్రాహ్మణులకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించే విధంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కేటాయించాలని, అతిముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు నేటికి తీరు మార్చుకోవడంలేదని అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మోకా ఆనందసాగర్, నియోజకవర్గ పరిశీలకుడు షేక్ సుభాన్, రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య నాయకులు నాగాబత్తుల శాంతకుమారిసుబ్బారావు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు పెదబాబు, నాయకులు నేదునూరి వీర్రాజు, గణపతి వీరరాఘవులు, చిట్టూరి శ్రీనివాస్, మొల్లేటి శ్రీనివాస్, బొప్పా ప్రతాప్, సంసాని పెద్దిరాజు, చిన్నం బాలవిజయరావు, మద్దాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.