ఇందుపల్లిలో వేద సభ
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:22 AM
అమలాపురం రూరల్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): సమస్త జీవకోటి సుభిక్షంగా జీవించేందుకు, మానవాళి జీవన విధానానికి వేదమే ప్రామాణికమని గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనాపాఠి పేర్కొన్నారు. బ్రహ్మశ్రీ రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్ 14వ వార్షిక వేద సభ ఆదివారం కోనసీమ జిల్లా ఇందుపల్లి అరవ గరువులో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శ్రీబాలభక్తగణపతి మందిరంలో నిర్వహించిన వేద సభకు తొలుత టీకే విశ్వనాథ్ వేదపండితులకు
అమలాపురం రూరల్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): సమస్త జీవకోటి సుభిక్షంగా జీవించేందుకు, మానవాళి జీవన విధానానికి వేదమే ప్రామాణికమని గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనాపాఠి పేర్కొన్నారు. బ్రహ్మశ్రీ రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్ 14వ వార్షిక వేద సభ ఆదివారం కోనసీమ జిల్లా ఇందుపల్లి అరవ గరువులో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శ్రీబాలభక్తగణపతి మందిరంలో నిర్వహించిన వేద సభకు తొలుత టీకే విశ్వనాథ్ వేదపండితులకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన వేద సభలో దువ్వూరి సూర్యప్రకాశ సోమయాజులు మాట్లాడుతూ మానవులు సమస్త జీవకోటి కోసం ఆచరించాల్సిన ఆచారాలు, కర్మకాండల గురించి వేదాల్లో వివరించిన విధానాన్ని తెలియజేశారు. సమస్త విద్యల స్వరూపంగా వేదాలు భాషిస్తున్నాయని పేర్కొన్నారు. వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనాపాఠి మాట్లాడుతూ ఎక్కడ వేదపఠనం జరుగుతుందో అక్కడ జీవరాశులు ఏవిధంగా సుభిక్షంగా ఉంటాయో వివరించారు. వేదికపై తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు పాల్గొని వేదాలు, ఉపనిషత్తుల సారాంశం తెలియచేశారు. తత్వ స్వరూపమై ఉన్న పరమాత్మున్ని తెలుసుకునేందుకు ఉపనిషత్తులు ఏవిధంగా దోహదపడతాయో విశదీకరిం చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు, ఘనాపాఠిలు, క్రమపాఠిలు వేదస్వస్తి నిర్వహించారు. కార్యక్రమంలో శిష్ఠా భవానీశంకర్, వేదశాస్త్ర పరిషత్ అధ్యక్షుడు కర్రా సోమసుందరశాస్ర్తి, కార్యదర్శి ముష్టి వేంకటరాజేశ్వరశర్మ, కోశాధికారి అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షితులు, ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వేదశాస్త్ర పరిషత్ తరపున ఘనాపాఠీలు, పండితులను సత్కరించారు.