Share News

వాడపల్లి వెంకన్న ఆలయ చైర్మన్‌గా వెంకట్రాజు

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:45 AM

రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ముదునూరి వెంకట్రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

వాడపల్లి వెంకన్న ఆలయ చైర్మన్‌గా వెంకట్రాజు

ఆత్రేయపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ముదునూరి వెంకట్రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాలకు చైర్మన్లు ఎంపిక చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తోంది. గత నెలలో వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అర్హత గల వారు దరఖాస్తు చేసుకున్నారు. కష్టించి పనిచేసి అధ్యాత్మిక సేవా భావాలు ఉన్నవారికి కూటమి ప్రభుత్వం ధర్మకర్తల మండలిలో చోటు కల్పించనుంది. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు విధేయుడుగా ఉన్న ఆత్రేయపురం గ్రా మానికి చెందిన మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు ముదు నూరి వెంకట్రాజును నియామకానికి బండారు కృషిచేశారు. ప్రభుత్వం ముదునూరి వెంకట్రాజు నియామకానికి ఖరారు చేయడంతో విధేయతకు పట్టగట్టినట్టయింది. పా ర్టీ కష్టకాలంలో బండారు వెంట నడిచిన ముదునూరికి చైర్మన్‌ గిరి దక్కింది. ఆక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకూ నిర్వహించే స్వా మివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందే ధర్మకర్తల మండలి కొలువుదీరనుంది. ఈ మేరకు 17 మంది ధర్మకర్తలతో నూతన పాలకవర్గం రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనరు ఉత్తర్వులతో ఏర్పడుతుందని చెబుతున్నారు. మంచి ముహూర్తం నిర్ణయించుకుని పాలకమండలి ప్రమణస్వీకార మహోత్సవం నిర్వహించనున్నారు. చైర్మన్‌గా నియమితులైన వెంకట్రాజును కూటమి నాయకులు పలువురు అభినందించారు.

Updated Date - Sep 19 , 2025 | 01:45 AM