కోరుకొండలో యూరియాకు తోపులాట
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:54 AM
యూరియాకు రైతులు పోటీపడుతున్నారు. కోరుకొండలో శనివారం మధ్యాహ్నం యూరి యా కోసం రైతులు పెద్ద ఎత్తున సొసైటీకి చేరుకుని ఒకరినొకరు తోసుకోవడంతో కోరుకొండ సొసైటీ కార్యాలయం ప్రధాన ముఖ ద్వారం అద్దాలు పగిలిపోయాయి.
కోరుకొండ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): యూరియాకు రైతులు పోటీపడుతున్నారు. కోరుకొండలో శనివారం మధ్యాహ్నం యూరి యా కోసం రైతులు పెద్ద ఎత్తున సొసైటీకి చేరుకుని ఒకరినొకరు తోసుకోవడంతో కోరుకొండ సొసైటీ కార్యాలయం ప్రధాన ముఖ ద్వారం అద్దాలు పగిలిపోయాయి. అద్దాలు గుచ్చుకుని కొంత మంది రైతులు గాయపడ్డారు. 10 గ్రామాల పరిధిలోని 5 వేల మంది రైతులకు కేవలం 10 టన్నుల యూరియా మాత్రమే కేటాయించారు. రైతులు తమకు యూరియా దొరకదేమోన్న ఆత్రుతతో ఒకరినొకరు తోసుకున్నారు. సుమారు 200 మంది రైతులు ఒక్కసారిగా మేడపైకి వెళ్లి బయోమెట్రిక్ వేయాలన్న ఆత్రుతతో తోపులాటకు దిగారు. దీని మూలంగా కార్యాలయ అద్దాలు పగిలిపోయాయి.విషయం తెలుసుకున్న కోరుకొండ పోలీసులు హుటాహుటిన సొసైటీకి చేరుకుని రైతులను అదుపు చేశారు. పగిలిన అద్దాలు పరిశీలించి సొసైటీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సొసైటీ పరిధిలో ఉన్న 10 గ్రామాల్లో సుమారు 5 వేల మంది రైతులు ఉన్నారు. ఒకొక్కరికి రెండు బస్తాలు యూరియా ఇస్తామని.. రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్, ఆధార్ జిరాక్స్ తీసుకురావాలని చెప్పారు.అయితే సొసైటీకి వచ్చిన యూరియా 225 బస్తాలు మాత్రమే. 225 బస్తాల యూరియా 5 వేల మంది రైతులకు ఎలా సరిపెట్టాలో తెలియక సొసైటీ సిబ్బంది తలలు పట్టుకున్నారు. ముందుగా వెళ్లిన వారికి యూరియా దొరుకుతుందనే ఆత్రు తతో ఒకరినొకరిని నెట్టికుని ముందుకు వెళ్ళాలని బలప్రయోగానికి దిగారు.
16 వేల ఎకరాల్లో నాట్లు
ఈ ఖరీఫ్ సీజన్‌లో కోరుకొండ మండలం లో సుమారు 16 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వ్యవవసాయాధికారుల లెక్కల ప్రకా రం 35 వేల బస్తాల యూరియా అవసరం ఉంది. కోరుకొండ మండలంలో కోరుకొండ, శ్రీరంగపట్నం, బూరుగుపూడి, దోసకాయలపల్లి, గాడాలలో సొసైటీలకు ఇప్పటి వరకు వచ్చిన ఎరువులు 300 మెట్రిక్ టన్నులు కూడా లేదు. జిల్లా వ్యాప్తంగా లెక్కలు పరిశీలిస్తే యూరియా ఇంచుమించుగా ప్రభుత్వం సరఫరా చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ రైతులు యూరియా అందక ఆందోళన చెందుతున్నారు. ఎరువులను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నా రు. జిల్లా వ్యవసాయ శాఖ సక్రమంగా కేటాయింపులు చేయకపోవడం వల్ల ఒక ప్రాంతానికి ఎక్కువ యూరియా వెళ్లిపోవడం, మరో ప్రాంతానికి తక్కువ రావడంతో రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్ధితి తప్పడం లేదు . కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అధికారులు చొరవ తీసుకుని జిల్లాలో ఎన్ని సహకార సంఘాలు ఉన్నాయి వాటి పరిధిలో ఎంత మంది రైతులు ఉన్నారో ఎంత వ్యవసాయ భూమి ఉన్నది పరిశీలిస్తే యూరియా ఎలాట్‌మెంట్‌లో తేడాలు బయట పడతాయి. అధిక మొత్తంలో కేటాయించిన యూరియాను బయటకు తీస్తే అందరికీ సక్రమంగా యూ రియా అందుతుందని సొసైటీల పాలక వర్గాలు, రైతులు, సీఈవోలు చెబుతున్నారు.
కోరుకొండకు 1285.39 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చాం..
రాజమహేంద్రవరం, ఆగస్టు 30 (ఆంధ్ర జ్యోతి) : కోరుకొండ సొసైటీకి శుక్రవారం 10.125 మెట్రిక్ టన్నుల యూరియా సర ఫరా చేశామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు తెలిపారు. ఇప్పటి వరకూ ఆ సొసైటీకి మొత్తం 70.875 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, ఇది గతం కంటే రెట్టింపు అన్నారు గతేడాది 40.500 మెట్రిక్ టన్నుల మాత్రమే ఇచ్చినట్టు చెప్పా రు. ఆదివారం మరో 20 మెట్రిక్ టన్నులు యూరియా పంపిస్తున్నా మన్నారు. కోరుకొండ మండలానికి ఇప్పటి వరకూ మొత్తం 1285.39 మెట్రిక్ టన్నులు పంపామని, వాస్తవానికి సెప్టెంబర్ నెల వరకూ 1342 టన్నుల యూరియా అవస రం ఉంటుందన్నారు.యూరియా కొరత అనేది నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.