యూరియాపై..విజిలెన్స్!
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:46 AM
యూరియాపై భిన్నవాదనలు.. అధికా రులు కొరత లేదంటున్నారు.. రైతులు కొరత అంటూ ఆందోళన చెందుతున్నారు. అవసరానికి సరిపడా పంపిస్తున్నామని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతోం ది.
మూడు జిల్లాలకు 3 టీమ్‌లు ఏర్పాటు
99 చోట్ల తనిఖీలు.. 16 కేసులు నమోదు
రూ.99.59 లక్షల విలువైన ఎరువులు సీజ్
గొల్లప్రోలు మండలం 548 బస్తాలు పట్టివేత
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
యూరియాపై భిన్నవాదనలు.. అధికా రులు కొరత లేదంటున్నారు.. రైతులు కొరత అంటూ ఆందోళన చెందుతున్నారు. అవసరానికి సరిపడా పంపిస్తున్నామని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతోం ది. అయితే రైతులు మాత్రం అడపాదడపా ఇబ్బందులు పడు తూనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో విజి లెన్స్ రంగంలోకి దిగింది. యూరియా పంపిణీ చేస్తున్న ఆర్ ఎస్‌కే, సొసైటీలు, ఎరువుల షాపులపై నిఘాపెట్టింది. కొరత లేనప్పటికీ సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందనే విషయాన్ని నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమైంది. గత నెల 23న విజిలెన్స్ అధి కారులు రంగంలోకి దిగారు. సొ సైటీలు, రైతు సేవా కేంద్రాలు, రిటైల్ షాపుల్లో మూడు జిల్లా ల్లో మూడు ప్రత్యేక బృందాలు నిరంతరం సంచరిస్తూ తనిఖీ లు చేస్తున్నాయి. రికార్డులు సరి గా లేకపోయినా, నిల్వ, అమ్మకా నికి పొంతన కుదరకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ వరకూ 99 తనిఖీలు చేసి 6(ఏ) కేసులు 16 నమోదు చేశారు. మూడు జిల్లా ల్లో రూ.99.59 లక్షలు విలువైన 318 టన్నుల ఎరువులు సీజ్ చేశారు. వీటిలో 130 టన్నుల యూరియా ఉంది. రికార్డులు సక్రమంగా లేని 31 కేసుల్లో రూ. 2 కోట్ల విలువైన 722 టన్నుల యూరియా విక్రయాలు నిలుపు దల చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో తాజాగా విజిలెన్స్, వ్యవసాయాధికారుల తనిఖీల్లో రెండు లారీల్లో అక్రమంగా తెచ్చిన 548 బస్తాల యూరియా స్వాధీనం చేసుకోవడంతోపాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
అక్రమ దందా..అడ్డంగా చిక్కారు!
పిఠాపురం/గొల్లప్రోలు రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): యూరియాపై ప్రభుత్వం, అధికా రులు ఎంత నిఘా ఉంచినా అక్రమ మార్గాల్లో తరలిపోతోంది. ఇతర ప్రాంతాల నుంచి యూరియాను లారీల్లో తెచ్చి బ్లాక్‌మార్కెట్‌కు తరలించి బస్తాపై అదనంగా రూ.400-500 వరకూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు ఎరువుల డీలర్లు గ్రా మాల్లోకి నేరుగా లారీలు తెచ్చి విక్రయాలు సాగిస్తున్నారు.గొల్లప్రోలు మండలం తాటిపర్తి, వన్నె పూడి గ్రామాల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారని, షాపులకు రావాల్సిన నిల్వలు పక్కదోవ పట్టిస్తున్నారని అందిన ఫిర్యాదులపై విజిలెన్స్ సీఐ ఐ.గోపాలకృష్ణ, వ్యవసాయశాఖ ఏడీ పి.స్వాతి, గొల్లప్రోలు మండల వ్యవసాయాధికారి కేవీవీ సత్యనారాయణ తనిఖీలు చేపట్టా రు. తాటిపర్తి గ్రామ శివారులో వన్నెపూడి రోడ్డు లో యూరియా లోడుతో రెండు లారీలను గుర్తించి విచారణ చేపట్టారు. డాక్టర్ బీఆర్ అం బేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి రైల్వే ర్యాక్ నుంచి 450 బస్తాల ఎన్‌ఎఫ్‌ఎల్ యూరియా తాటిపర్తి నాగదుర్గా ఏజన్సీస్‌కు లారీలో తెచ్చారు. అయితే షాపు నిర్వాహకుడు సదరు లారీని షాపు వద్దకు రానివ్వకుండా వేరే ప్రాంతంలో నిలపమని చెప్పి ఆటోలు, మోటార్ సైకిళ్ల ద్వారా 127 బస్తాల యూరియా తరలించినట్టు లారీ డ్రైవ ర్ తెలిపారు. మరో లారీలో 450 బస్తాల యూరియాను ద్వారపూడి రైల్వే వేగన్ నుంచి తాటిపర్తిలోనే నాగదుర్గా ఏజన్సీస్‌తోపాటు దుర్గా సరస్వతి ట్రేడర్స్‌కు తీసుకువచ్చారు. ఇం దులో 225 బస్తాల వంతున రెండు షాపులకు తీసుకోవాలని చెప్పారని లారీ డ్రైవర్ తెలిపారు. నాగదుర్గా ఏజన్సీస్‌కు వచ్చిన స్టాకును వన్నెపూడిలో రోడ్డుపై నిలిపి రూ.400 వం తున విక్రయించినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. తాటిపర్తి డీలర్లకు ఈ స్టాకు హోల్‌సేల్ డీలర్లుగా ఉన్న సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం లక్ష్మీ కల్యాణి ఎంటర్‌ప్రైజెస్, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఏజన్సీస్ నుంచి పంపినట్టు గుర్తించారు. యూరియా అక్రమ రవాణా, బ్లాక్‌మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించి రెండు లారీలతోపాటు 548 బస్తాల యూరియా స్వాధీనం చేసుకున్నారు. వీరు తనిఖీలు చేస్తున్న సమయంలోనే ఈ పోస్ మిషన్ ద్వారా నాగదుర్గా ఏజన్సీస్ ప్రతినిధి రైతుల వేలిముద్రలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా సదరు మిషన్‌ను సైతం సీజ్ చేశారు. వీటిని గొల్లప్రోలు పోలీసులకు అప్పగించారు. విజిలెన్స్, వ్యవసాయాధికారుల తనిఖీలు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ కొనసాగాయి.
నలుగురి అరెస్టు
యూరియా అక్రమ రవాణా, బ్లాక్‌మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయించడం, ఈపోస్ యంత్రాలను దుర్వినియోగం చేసి రైతుల వేలిముద్రలు సేకరించి తప్పుడు రికార్డులు సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాలపై ఏవో సత్యనారాయణ ఫిర్యాదు మేరకు రెండు కేసులు రిజిస్టర్ చేశామని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. తాటిపర్తి నాగదుర్గా ఏజ న్సీస్ నిర్వాహకుడు దాసం శ్రీని వాస్, హెల్పర్ కర్రెడ్ల కనక వీరబాబు, మండపేట మండలం ద్వారపూడికి చెందిన డ్రైవర్లు కొటారి వీరబాబు, గుత్తుల దుర్గారావులపై కేసు నమోదు చేశా మని, వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
బుధవారం లైసెన్స్ రద్దు చేసినా..
తాటిపర్తిలోని నాగదుర్గా ఏజన్సీస్‌కు 30 టన్నుల యూరియా రాగా, దానిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో వ్యవసాయాధికారి సత్యనారా యణ బుధవారం తనిఖీలు చేసి దగ్గరుండి ఎమ్మార్పీ ధరలకు విక్రయించడంతో పాటు లైసెన్స్ రద్దు చేశారు. అయినా లెక్క చేయకుండా యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం గమనార్హం.
సీజ్ చేస్తున్నారు.. తరలించేస్తున్నారు!
గతంలో సీజ్ చేసిన ఎరువులను కేసు పరిష్కారం కాబడే వరకూ రిలీజ్ చేయడం జరిగేది కాదు. దీంతో నెలల తరబడి ఎరువులు గోదాముల్లో ఉండేవి. ఇప్పుడు యూరియా సీజ్ చేస్తే 24 గంటల్లో అవసరం ఉన్న చోటికి తరలిస్తున్నారు.
సమస్య ఉంటే డయల్ 80082 03262
యూరియా సరఫరాపై అప్రమత్తంగా ఉన్నాం. విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేసి అక్రమాలపై కేసులు పెడుతున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు విక్రయించడం తదితర అక్రమాలపై సమాచారం ఉంటే వెంటనే 80082 03262 నెంబరుకు సమాచారం ఇవ్వాలి.
- స్నేహిత, విజిలెన్స్ అధికారి, ఉమ్మడి తూర్పుగోదావరి