ఉపాధి ఆ‘వేతన’!
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:51 AM
ఉపాధి కూలీల ఆవేదన అంతా ఇంతా కాదు.. పనిచేసినా కూలిడబ్బులందక లబోదిబోమంటున్నారు.. జాబ్ కార్డు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు..
ఉపాధి నిధులు పెండింగ్
కూలీల ఆకలి కేకలు
ముందుకు సాగని పనులు
పేరు మార్పుతో ఆందోళన
నిధులకు డిమాండ్
( రాజమహేంద్రవరం/కాకినాడ/అమలాపురం- ఆంధ్రజ్యోతి)
ఉపాధి కూలీల ఆవేదన అంతా ఇంతా కాదు.. పనిచేసినా కూలిడబ్బులందక లబోదిబోమంటున్నారు.. జాబ్ కార్డు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు..మరో వైపు ఉపాధి పనులు పెండింగ్ పడ్డాయి. ఎందుకంటే ఒకటా రెండా ఏకంగా మూడు నెలలుగా ఉపాధి నిధులు పెండింగ్‌లో పడ్డాయి.. కోట్లాది రూపాయల నిధులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఉపాధి పథకం పేరు చెబితే అటు కూలీలు ఆసక్తి చూపడం లేదు.. ఇటు అధికారులు ఆ సంగతే మర్చిపోయారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. తూర్పుగోదావరి జిల్లాలో రూ.33 కోట్లు నిధులు పెండింగ్ ఉన్నాయి. కాకినాడలో రూ.26 కోట్లు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో రూ. 6.14 కోట్లు పెండింగ్ ఉన్నట్టు సమాచారం. మరో వైపు ఉపాధి పథకం కొత్త బిల్లుతో ఆందోళన నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల మంది ప్రజలకు ఉపాధి కలిగించే పథకం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్)పై అనాసక్తి నెలకొంది.ఉపాధి హామీ నిధులు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి.వేతనాలు సకాలంలో విడుదల చేయక పోవడం వల్ల కూలీలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపుగా 4.05 లక్షల జాబ్‌కార్డులుండగా,వీటిలో మొత్తం వేతన దారులు 7.89 లక్షల మంది ఉన్నారు. ఏటా 1.56 లక్షల కుటుం బాలు ఉపాధి పొందుతున్నాయి. కూలీ ల వేతనాలకు రూ.370 కోట్ల వరకు ఖర్చవుతోంది. కూలీకి సరాసరి రూ.282 వరకు అం దుతోంది. ఏటా 30 వేల కు టుంబాలు వంద రోజుల పని లక్ష్యం పూర్తి చేసుకుం టున్నా యి. కేంద్రం మెటీ రియల్ కాంపో నెంట్ నిధులు ఉమ్మడి జిల్లాకు ఏటా రూ.290 కోట్ల వరకు వస్తోంది.
ఉపాధి కొత్త బిల్లుతో లాభమా..నష్టమా?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక హామీ మిషన్ (గ్రామీణ్) బిల్లు తో కూలీలకు లాభం కంటే నష్టమే అధికం అన్న అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త చట్టం ద్వారా పాత పథకం ద్వారా ఒన గూరే ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళనలు ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఈ పథకం ద్వారా వంద రోజులు వరకు పనిదినాలు హామీగా పొందే అవకాశం లభిస్తుం డగా.. కొత్త చట్టంలో 125 రోజులకు పెంచారు. కూలీలకు వేతనాలను 15 రోజుల గడువు కింద చెల్లిస్తుండగా దాన్ని వారానికి కుదించారు. అంటే చేసిన పనికి ఉపాధి కూలీకి వారంలోగా చెల్లించాలి. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు పని కల్పించడం నిలిపివేయాలని ప్రతిపాదిం చడం కొంత కలవర పాటుకు గురిచేస్తోంది. పథకం కింద అయ్యే ఖర్చులో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10శాతం నిధులు భరిస్తుండగా, కొత్త ప్రతిపాదిత బిల్లులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాలనే నిబంధన విధించడంతో ఆర్థిక భారంతో రాష్ట్రంలో చేపట్టే పనులు తగ్గుతాయనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
పేరు మార్పుపై?
పేద ప్రజల ఉపాధికి అమల్లోకి తెచ్చిన ఉపాధి హామీ పథానికి ఇంత వరకూ మహాత్మగాంధీ పేరు ఉండేది. కానీ కేంద్రం ఆకస్మికంగా రెండు రోజుల కిందట ఈ పేరు మార్చేసి వీబీ- జీ రామ్‌జీ అనే పేరు పెట్టింది. గాంధీ పేరు ఆక స్మికంగా ఎందుకు మార్చారనేది తీవ్ర చర్చనీ యాంశం కావడం గమనార్హం. ఆహారభద్రతకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో దీనిని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
తూర్పున రూ. 33 కోట్లు పెండింగ్
ఉపాధి హామీ పనుల బిల్లులు పెండింగ్ అవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో జీతాలు, మెటీరియల్ తదితర బిల్లులు రూ.33 కోట్ల వర కూ పెండింగ్‌లో ఉన్నాయి. జూలై తర్వాత సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం గమ నార్హం. తూర్పు గోదావరి జిల్లా 18 మండలాల పరిధి 300 పంచాయతీల్లో 1.42 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. యాక్టివ్ కార్డులు 1.17 లక్షలు. అందులో వేతనాలు పొందే అవకాశం ఉన్న వారు 2.16 లక్షల మంది ఉన్నారు. ఉపాధి పొందే వారి సంఖ్య 1.65 లక్షలుగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 30.46 లక్షల పనిది నాలు కల్పించారు. రోజు వారీ జీతం ఒక్కొ క్కరికి రూ. 275.70, గరిష్ట వేతనం రూ.307. ఒక్కో ఇంటికి కనీసం 38.23 పనిదినాలు చూపు తున్నట్టు చెబుతున్నారు. 2025-26లో 34 లక్షల మందికి పనికల్పించాలనేది లక్ష్యం. ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకూ 100 శాతం పనిదినాలు ఉపయోగించుకున్న కుటుంబాలు 580 ఉన్నా యి. మొత్తం జిల్లాలో రూ.83.89 కోట్లు పని చేయగా..జూలై 21 వరకూ రూ.75.75 కోట్లు చెల్లించారు.రూ.8.14 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.గత మూడు నెలలుగా బిల్లులు చెల్లిం చడంలేదు. మెటీరియల్‌కు రూ.1.17 కోట్లు ఖర్చు చేయగా..మెటీరియల్ లయబిల్టీ కింద రూ.22 కోట్లు కలిపి మొత్తం రూ.23.17 కోట్లు పెండిం గ్‌లో ఉంది. ప్రతి మండలంలో బకాయి ఉంది.