రేపు బెజవాడకు డీఎస్సీ అభ్యర్థులు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:45 AM
మెగా డీఎస్సీ - 2025లో విజయం సాధించిన 3315 మంది ఉపాధ్యాయ అభ్యర్థులను రాజమహేంద్రవరం నుంచి ఈనెల 25న విజయవాడలో జరిగే సభకు తీసుకెళ్లనున్నారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఎంపికైన కొత్త టీచర్లను 72 బస్సుల్లో తరలిస్తారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ఈ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
నేడు రాజమండ్రిలో రిజిస్ట్రేషన్
ఇక్కడి నుంచే విజయవాడకు
3315 మంది అభ్యర్థులు
72 ఆర్టీసీ బస్‌లు ఏర్పాటు
5 పాఠశాలలు కేటాయింపు
రాజమహేంద్రవరం/అర్బన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ - 2025లో విజయం సాధించిన 3315 మంది ఉపాధ్యాయ అభ్యర్థులను రాజమహేంద్రవరం నుంచి ఈనెల 25న విజయవాడలో జరిగే సభకు తీసుకెళ్లనున్నారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఎంపికైన కొత్త టీచర్లను 72 బస్సుల్లో తరలిస్తారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ఈ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సీఎం చేతుల మీదుగా కొత్త టీచర్లకు నియామకపత్రాలు అందజేస్తారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 50 బస్సులు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 10 బస్సులు, కాకినాడ నుంచి 12 బస్‌లు బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకుంటాయి. ఇక్కడి నుంచే విజయవాడ వెళతాయి. ఇప్పటికే స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి బస్సులను పంపడంలో ఆర్టీసీ అధికారులు తలమునకలై ఉన్నారు. విజయవాడ సభకు బస్సులు కేటాయించాల్సి రావడం ఆర్టీసీ అధికారులకు కత్తిమీదసాములా మారనుంది.
నేడు పేర్లు రిజిస్ట్రేషన్..
విజయవాడ వెళ్లే ఉపాధ్యాయ అభ్యర్థులకు కొన్ని ఎంపిక చేసిన స్కూళ్ల వద్ద రిజిస్ర్టేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. ఈ స్కూళ్ల వద్దనే వీరంతా బస్సులు ఎక్కాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరం శ్రీరామనగర్‌లోని బీవీఎం ఉన్నతపాఠశాల, మోరంపూడిలోని శ్రీచైతన్య ఉన్నతపాఠశాల, లాలాచెరువు మునిసిపల్ ఉన్నతపాఠశాల, శంభూనగర్ ఫ్లైఓవర్ కింద బాలాజీ పేట సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల, బొమ్మూరు ప్రభుత్వ డైట్ కళాశాల దగ్గర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలను కేటాయించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వారు ఒక సహాయకుడు /సహాయకురాలితో కలిసి బుధవారం సాయం త్రం 4 గంటలకు వారికి కేటాయించిన పాఠశా లల వద్ద రిజిస్ట్రేషను నిమిత్తం హాజరుకావాలని ఆదేశించారు.అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు,ఆధార్, కాల్ లెటర్, దుప్పటి, తలగడ, గొడుగు తెచ్చుకోవాలన్నారు.24న వసతి, రాత్రి భోజనం,25న ఉదయం అల్పాహారం, విజయ వాడకు బస్సు సదుపాయం కల్పించామన్నారు.