Share News

జిల్లాలో 4,500 ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజులు యోగా శిక్షణ : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:44 AM

ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు యోగాసనాల శిక్షణా కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లావ్యాప్తంగా 4500 వేదికల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు.

జిల్లాలో 4,500 ప్రాంతాల్లో నేటి నుంచి  మూడు రోజులు యోగా శిక్షణ : కలెక్టర్‌

అమలాపురం, జూన్‌17(ఆంధ్రజ్యోతి): ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు యోగాసనాల శిక్షణా కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లావ్యాప్తంగా 4500 వేదికల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ జిల్లాలోని వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పండుగ వాతావరణంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఆటస్థలాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా ప్రాంగణాలను ఇప్పటివరకు 4,500ను గుర్తించి శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు నమోదు ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. యోగా అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ప్రశంసా పత్రాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రెండున్నర లక్షల మంది ఎన్‌రోల్మెంట్‌ పూర్తి చేసుకున్నారని తెలిపారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బస్సుల ద్వారా జనాన్ని తరలిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో డీఆర్వో రాజకుమారి, ఏవో కాశీవిశ్వేశ్వరరావు, డీఈవో షేక్‌ సలీంబాషా పాల్గొన్నారు. కాగా ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రొటోకాల్‌ ప్రకారం విజయవంతం చేయాలని జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలను కలెక్టర్‌ మంగళవారం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా యోగాంధ్ర నిర్వహణ, తల్లికి వందనం కార్యక్రమాలపై మండల అధికారులకు జిల్లా కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు.

Updated Date - Jun 18 , 2025 | 01:44 AM