Share News

ఈ ఏడాదైనా ట్రఫ్‌ పనులు జరిగేనా?

ABN , Publish Date - May 12 , 2025 | 12:37 AM

రైతులకు సక్రమంగా సాగునీరు అందేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని, ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని జలవనరుల శాఖ చెబుతున్న మాటలు అమలు జరుగుతాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

 ఈ ఏడాదైనా ట్రఫ్‌ పనులు జరిగేనా?

కాల్వలు మూసినా ప్రారంభంకాని పనులు

రెండుసార్లు ప్రతిపాదనలు పంపించాం, అనుమతులు రాలేదని అంటున్న అధికారులు

మలికిపురం, మే 11(ఆంధ్రజ్యోతి): రైతులకు సక్రమంగా సాగునీరు అందేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని, ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని జలవనరుల శాఖ చెబుతున్న మాటలు అమలు జరుగుతాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గుడిమెళ్లంకలో మోరి కాల్వ వేపచెట్టు డ్రెయిన్‌ వద్ద ట్రఫ్‌ శిథిలమై దశాబ్ద కాలం అయినా జలవనరుల శాఖ పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు చేస్తున్నారు. గత ఏడాది దాళ్వా ముమ్మర సమయంలో ట్రఫ్‌ శిథిలమవడంతో సాగునీరు వేపచెట్టు డ్రెయిన్‌లోకి పోయింది. దీంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందలేదు. తక్షణ చర్యలుగా మలికిపురం నీటిసంఘం ఆధ్వర్యంలో రూ.2లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి సాగునీరు పంపిణీచేసి మమా అనిపించారు. ఈఏడాది కాల్వలు కట్టేసిన తరువాత ట్రఫ్‌ నిర్మాణం జరుగుతుందని, రైతుల సమస్యలు తీరుతాయని ఆశించారు. కానీ ఈఏడాది కూడా జలవనరుల శాఖ ఈ ట్రఫ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదని తెలిసింది. ఈకాల్వ పరిధిలో 500ఎకరాల ఆయకట్టు ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి దీని నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఇరిగేషన్‌ ఏఈఈ రమేష్‌, మలికిపురం నీటిసంఘం అధ్యక్షుడు తిరమల సుబ్బారావును అడగ్గా రూ.50లక్షలతో రెండుసార్లు ప్రతిపాదనలు పంపామని, అనుమతి లభించలేదని అన్నారు. తాత్కాలికంగా తాము మరమ్మతులు చేసినా రూ.2లక్షలు కూడా విడుదల చేయలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా మరోసారి ప్రయత్నం చేస్తామని వారు తెలిపారు.

Updated Date - May 12 , 2025 | 12:37 AM