ఈసారి పుష్కలంగా!
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:31 AM
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రంగంపేట మండలానికి పుష్కర ఎత్తిపోతల నీరు పుష్కలంగా అందే సూచనలు కనిపిస్తున్నాయి. మండలానికి ప్రధానంగా చాగల్నాడు, వెంకటనగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందుతుంది. అయితే పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు గ్రామాలకు చెందిన మూడువేల ఎకరాలకు నీటి కేటాయింపు ఉంది.
రంగంపేటకు పుష్కర ఎత్తిపోతల నీరుపై ఆశాభావం
సాగునీటి సాధన కమిటీ కృషి
పంట కాలువల శుద్ధితో మార్గం సుగమం
రంగంపేట, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రంగంపేట మండలానికి పుష్కర ఎత్తిపోతల నీరు పుష్కలంగా అందే సూచనలు కనిపిస్తున్నాయి. మండలానికి ప్రధానంగా చాగల్నాడు, వెంకటనగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందుతుంది. అయితే పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు గ్రామాలకు చెందిన మూడువేల ఎకరాలకు నీటి కేటాయింపు ఉంది. ఇందులో గండేపల్లి మండలం బొర్రంపాడు పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి రంగంపేట మండలం పెదరాయవరం, చండ్రే డు, వడిశలేరు గ్రామాలకు చెందిన సుమారు 1200 ఎకరాలకు నీరందే ఏర్పాటు ఉంది. అలాగే బొర్రంపాడు ఎత్తిపోతల పథకం ఎడమ కాలువ నుంచి మర్రిపూడికి, కుడికాలువ నుంచి కోటపాడు, వెంకటాపురం గ్రామాలకు చెందిన 1800 ఎకరాలకు నీరు అందవలసి ఉంది. వాస్తవానికి 3000 ఎకరాలకు గాను వెయ్యి నుంచి 1200 ఎకరాలకు ఇంతవరకు నీరందుతోంది. కూటమి పాలనలో ఆరు గ్రామాలకు చెందిన 3 వేల ఎక రాలకు నీరు అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చొరవతో సాగునీటి సాధన కమిటీ మండల కన్వీనర్ పుట్టా సోమన్నచౌదరి కమిటీ సభ్యులతో 3 నెలలు వ్యవధిలో పుష్కర ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగ్గంపేట, నాయకంపలి, యర్రంపాలెం గ్రామాల్లో జరిగిన పలు సమావేశాలకు హాజరై పుష్కర వాటా నీరుపై బలమైన వాదన వినిపించడంతోపాటు అలాగే పుష్కర ఈఈ రాజేశ్వరరావు, సాగునీటి సంఘం డీసీ అధ్యక్షుడు పాలకుర్తి లక్ష్మీపతిరావులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇటీవల సాగునీటి సంఘాల ద్వారా పంట కాలువలను శుద్ధి చేయడంతో మండలంలో ఆరు గ్రామాలకు నీరు అందడానికి ఇప్పుడు మార్గం ఏర్పడింది.
రంగంపేట, దొడ్డిగుంటకు నీరివ్వాలి
మండలంలోని ఆరు గ్రామాలతో పాటు అవ కాశం ఉన్న రంగంపేట, దొడ్డిగుంట గ్రామా ల ఆయకట్టుకు నీరివ్వాలని సోమన్నచౌదరి విజ్ఞప్తి చేశారు. అలాగే బొర్రంపాడు ఎత్తిపోతల పథకాన్ని వేధిస్తున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమస్యను పరిష్కరించి మండలానికి పూర్తి న్యాయం చేయాలని పుష్కర అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కాగా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మర్రిపూడిలో 800 ఎకరాలు, కోటపాడులో 700, వెంకటాపురంలో 500, పెదరాయవరం 425, చండ్రేడు 350, వడిశలేరు 225 ఎకరాల ఆయకట్టు ఉంది.