నిలువ నీడ కరువు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:06 AM
టీబీ అనుమానిత లక్షణాలతో పరీక్షలు చేయించుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి(జీజీహెచ్)కి వస్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ఎండకు ఎండి... వానకు తడుస్తూ అన్న చందంగా నానా అగచాట్లు పడుతున్నారు. కూర్చోడానికి కాదు కదా, కనీసం నిలబడడానికి ఇక్కడ సరైన చోటు లేదు.
పరీక్షల కోసం జీజీహెచ్ వచ్చే టీబీ అనుమానితుల దుస్థితి
మండుటెండలో నిలబడక తప్పదు
వానొచ్చినా అంతే!
పట్టించుకోని వైద్యాధికారులు
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): టీబీ అనుమానిత లక్షణాలతో పరీక్షలు చేయించుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి(జీజీహెచ్)కి వస్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ఎండకు ఎండి... వానకు తడుస్తూ అన్న చందంగా నానా అగచాట్లు పడుతున్నారు. కూర్చోడానికి కాదు కదా, కనీసం నిలబడడానికి ఇక్కడ సరైన చోటు లేదు. శాంపిల్స్ కలెక్ట్ చేసే 4వ నెంబరు గది కిటికీ అవతల కంపుగొట్టే డ్రైనేజీ పక్కనే నిలబడి అనుమానితులు టెస్టు శాంపిల్స్ డబ్బాతో ఎదురు చూడాల్సి ఉంటుంది. టెస్టుల కోసం వచ్చేవారు మండుటెండలో నిలబడక తప్పదు. వర్షం కురిస్తే తడుస్తూనే శాంపిల్స్ ఇవ్వాలి. అంతటి దయనీయమైన, దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు ప్రతి రోజూ సుమారు 50 నుంచి 60 మంది వరకూ అనుమానితులు శాంపిల్స్ పట్టుకుని టెస్టులకు వస్తుంటారు. అప్పటికే టీబీకి మందులు వాడుతున్న వారు రెండు నెలలకు ఒకసారి క్లినికల్ సర్వేకు వస్తారు. ఏఆర్‌టీ సెంటర్ల నుంచి టీబీ రోగులు, అనుమానితులు పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులతోపాటు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి అనుమానిత లక్షణాలున్నవారు ఇక్కడికే టెస్టులకు వస్తుంటారు. జీజీహెచ్‌లో అత్యాధునిక సీబీ నాట్, ట్రూ నాట్ పరీక్షలు చేస్తుంటారు. రెండు గంటల్లో రిపోర్టులు వస్తాయి. రద్దీ ఎక్కువగా ఉంటే మరుసటి రోజు రావాల్సి ఉంటుంది.రిపోర్టులో పాజిటివ్ వస్తే మందులు పెడతారు. చాలా మంది అనుమానిత లక్షణాలున్నా టీబీ పరీక్షల కోసం జీజీహెచ్‌కు రావడానికి వెనుకంజ వేస్తుంటారు. వైద్య, ఆరోగ్యశాఖ ఫీల్డు సిబ్బంది ఎలాగోలా వారిని ఒప్పించి జీజీహెచ్‌కు తీసుకొస్తున్నా ఇక్కడి దారుణమైన పరిస్థితులు వారికి శాపంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీబీ అనుమానిత బాధితులకు కనీస సౌకర్యాలు ఏర్పాటుపై రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యాధికారులు నిర్లక్ష్యం చూపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.