టెట్..రాసేదెట్టా!
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:37 AM
టెట్..టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేవారందరూ తప్పనిసరిగా ఎదు ర్కోవాల్సిన పరీక్ష..
2011 ముందు వారికి అమలు
రెండేళ్లలో ఉత్తీర్ణత అవకాశం
23 వరకు దరఖాస్తు గడువు
డిసెంబర్ 10న పరీక్ష
టెట్‌కు పెరిగిన డిమాండ్
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
టెట్..టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేవారందరూ తప్పనిసరిగా ఎదు ర్కోవాల్సిన పరీక్ష..ఈ పరీక్ష పాసైతేనే.. పాఠాలు చెప్పేందుకు అర్హులు. మరో వైపు ప్రభుత్వ పాఠశాలైనా.. ప్రైవేటు స్కూలైనా.. బడిలో పాఠాలు బోధించాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాల్సిందే. 2011కి ముందు ఉపాధ్యాయులుగా విధుల్లోకి చేరిన వారందరూ ఈ పరీక్ష రాయాల్సిందే. రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలి.. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలివి. ఈ నిబంధనలతో ఉపాధ్యాయులు పరీక్షకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
23వరకు దరఖాస్తు గడువు
నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులతో పాటు ఈసారి ఇన్ సర్వీస్ టీచర్లకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) ఉత్తీర్ణత తప్పనిసరి చేయడంతో పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 23వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంది. డిసెంబర్ 10న పరీక్ష ఉండడంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 150 మార్కుల చొప్పున రెండు పేపర్లను రాయాలి. డిసెంబర్ 10వ తేదీ ఉదయం 9.30 నుంచి ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్ ఇలా రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరి 2న టెట్ కీ విడుదల చేయనున్నారు. తుది కీ జనవరి 13న ప్రకటించిన అనంతరం 19న టెట్ ఫలితాలను ప్రకటించనున్నారు.
పది వేల మందిపైనే పరీక్షకు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పది వేలమంది వరకూ ఇన్‌సర్వీస్‌లో ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. జిల్లాలో 6 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సగం మందికి పైగా టెట్ రాయాల్సి ఉంది. 2012, 2014, 2018, 2025 నుంచి టెట్‌లో ఉత్తీర్ణులైన వారినే డీఎస్సీకి ఎంపిక చేస్తున్నారు. పేపర్-1, 2 క్వాలిఫై అయిన వారు మాత్రమే ఎంపికయ్యారు. 2011కు ముందు ఉద్యోగాల్లో చేరిన వారందరూ కచ్చితంగా టెట్ రాయాలి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాల, గురుకుల, మునిసిపల్ పాఠశాలల్లోను, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి ఇదో పెద్ద పరీక్షలా ఉంది. టెట్ ప్రకటనపై ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరీక్షను ఎలా ఎదుర్కోవాలా అని 2011కి ముందు ఎంపికైన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. 1994, 1996, 1998, 2000, 2001, 2002, 2003, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ రాయాలి.ఇదిలా ఉంటే 2030 ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేయనున్న ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్-2, హెచ్‌ఎం తదితర కేడర్ల ఉపాధ్యాయులకు ఈ టెట్ నుంచి మినహాయింపునిచ్చారు.ఉపాధ్యాయ సంఘాలు టెట్ అర్హతపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని సంఘాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోరుతూ కొంత మంది ఎమ్మెల్సీలు మంత్రి లోకేశ్‌ను కలిశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురుచూస్తున్నారు.