ఫలితం..పదిలం!
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:49 AM
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 91.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ద్వితీయస్థానంలో నిలిచింది. జిల్లాలో అధికంగా బాలురు ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా 18,871 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 17,253 మంది అంటే 91.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
గతేడాది 21 - ఈ ఏడాది ఆరో స్థానం
గతేడాది 82ు.. ఇప్పుడు 87.99ు
తూర్పున పైచేయి సాధించిన బాలికలు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 91.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ద్వితీయస్థానంలో నిలిచింది. జిల్లాలో అధికంగా బాలురు ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా 18,871 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 17,253 మంది అంటే 91.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానం సాధించగా, కోనసీమ జిల్లా 91.43 శాతం ఉత్తీర్ణతతో ద్వితీయస్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా 47.64 శాతంతో ఉత్తీర్ణతతో చిట్టచివరి స్థానంలో నిలిచింది. కోనసీమ జిల్లాలో 9392 మంది బాలురు పరీక్షలు రాయగా వారిలో 8420 మంది 93.18.శాతం ఉత్తీర్ణత సాధించారు. 9479 మంది బాలికలు పరీక్షలు రాయగా వారిలో 8833 మంది 89.67 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో బాలురు 78.3 శాతం మంది ఉత్తీర్ణులైతే బాలికలు 84.09 శాతం మంది ఉత్తీర్ణులై ఆధిక్యత చాటుకున్నారు. కోనసీమ జిల్లాలో ఫస్ట్ డివిజన్‌లో 14,504 మంది, సెకండ్ డివిజన్‌లో 1900 మంది, థర్డ్ డివిజన్‌లో 849 మంది వెరసి 17,253 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీషు మీడియంలో 83.19శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణులు కాగా తెలుగు మీడియంలో 58.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా అమలాపురం పట్టణానికి చెందిన శ్రీచైతన్యటెక్నోస్కూలు విద్యార్థి తురగా మధుచంద్రిక 597 మార్కులు, తాపేశ్వరంలోని శ్రీచైతన్య టెక్నోస్కూల్‌కు చెందిన పోతంశెట్టి రామతులసిలు 597 జిల్లాలో అత్యధిక మార్కులు సాధించారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీని మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజులు చెల్లించుకోవాలని సూచించారు.
‘పది’ంతల ఆనందం
కోరుకొండ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించారు. కోరుకొండ మండలం నుంచి 1161మంది విద్యార్థులు హాజరుకాగా 1087 మంది(94శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు ఎంఈవో టి.కుశలవ దొర తెలిపారు. శ్రీరంగపట్నం జడ్పీ హైస్కూల్ నుంచి పెంటకోట శ్రీవిజయ, గాదరాడ జడ్పీ హైస్కూల్ నుంచి జి.రమ్య 578 మార్కులతో సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచారు. గుమ్ముళ్ళూరు జడ్పీ హైస్కూల్ నుంచి బి.గౌతమి కావ్యశ్రీ 577 మార్కులతో ద్వితీయ, శ్రీరంగపట్నం జడ్పీ హైస్కూల్ నుంచి బి.సాయిజగన్ బాబి 569 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్టు ఎంఈవోలు టి. కుశలవదొర, ఎం.సుజాతలు తెలిపారు. దోసకాయలపల్లి జడ్పీ హై స్కూల్లో మానేపల్లి దుర్గా మహాలక్ష్మి 571 మార్కులు, తాటిపూడి మనోజ్ఞ 569 మార్కులు, కోసూరి కావ్యశ్రీ 566 మార్కులు సాధించారు.
అనపర్తిలో 94శాతం..
అనపర్తి, ఏప్రిల్ 23 (ఆంరఽధజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 94శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేటు పాఠశాలల్లో 99శాతం ఉత్తీర్ణత సాధించారు. అనపర్తిలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థి సత్తి కోదండరామారెడ్డి(592) మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచాడు. కుతుకులూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థి కర్రి సంజీవరెడ్డి(587) మార్కులతో మండల ద్వితీయ స్థానం, అనపర్తి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని జి.ప్రసన్న సత్య(584) మార్కులతో తృతీయ స్థానం సాధించారు. లక్ష్మీనరసాపురంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 73మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 73మంది విద్యార్ద్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంఈవో నల్లమిల్లి సత్తిరెడ్డి, పాఠశాల కమిటీ చైర్‌పర్సన్లు మల్లిడి పార్వతి, నల్లమిల్లి నల్లమిల్లి విజయలక్ష్మి, కూటమి నాయకులు అభినందించారు.