ఓ..గాడ్!
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:37 AM
రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తూ ర్యాంకులు విడుదల చేస్తోంది.
ఆలయాల్లో సేవలపై కూటమి దృష్టి
4 ప్రశ్నలతో ఐవీఆర్‌ఎస్ సర్వే
ర్యాంకులు ప్రకటించిన సీఎం
మొదటి స్థానంలో కోట సత్తెమ్మ
అన్నవరం, వాడపల్లి ఆరో స్థానం
9వ స్థానంలో తలుపులమ్మ లోవ
అత్యధిక శాతం అసంతృప్తి
రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తూ ర్యాంకులు విడుదల చేస్తోంది. తద్వారా ప్రధాన దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భావిస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో మొదటిప్రశ్నగా దర్శనం సంతృప్తిగా జరిగిందా?, దేవాలయాల్లో తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది?, ప్రసాదం తాజా, రుచిగా ఉందా?, దేవాలయాల్లో పారిశుధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే అంశాలపై సర్వే నిర్వహించి దీనిపై భక్తుల సమాధానాలను బట్టి ర్యాంకింగ్‌ను ప్రకటిస్తుంది. వీటిలో లోపాలను సరిదిద్దాల్సిన ఆవశ్యకతపై అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు వరకు నిర్వహించిన సర్వే వివరాలను డిసెంబరు 1న అమరావతిలో సీఎం చంద్రబాబు విడుదల చేశారు. డీసీ హోదా కలిగిన 14 ఆలయాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం 70.2 శాతం మొదటి స్థానంలో నిలిచింది. నిడదవోలు కోట సత్తెమ్మ 70.2 శాతం, ఉరుకుంద 69.5, పెంచలకోన 67.5, చౌడేపల్లి 66.7, వాడపల్లి 66.5, విశాఖ కనకమహాలక్ష్మి 65.7, అరసవల్లి 63.7, తుని తలుపులమ్మలోవ 63.6 శాతంతో సంతృప్తి స్థాయిలో నిలిచాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో అన్నవరం, వాడపల్లి, తుని తలుపులమ్మలోవ, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయాలపై ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.ఆలయాలకు వచ్చే భక్తులకు దర్శనం, ప్రసాదం రుచి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటితో పాటు మౌలిక సదుపాయాలుగా నాలుగు అంశాలపై ప్రశ్నలు వేశారు.ఆర్జేసీ కేడర్ జాబితాలో ఏడు ప్రధాన ఆలయాలు ఉండగా అన్నవరానికి ఆరో స్థానం లభించింది. డిప్యూటీ కమిషనరు హోదా కలిగిన 14 ప్రధాన ఆలయాల్లో నిర్వహించిన సర్వేలో వాడపల్లికి 6వ స్థానం, తలుపులమ్మ లోవకు 9వ స్థానం లభించాయి. నిడద వోలు కోట సత్తెమ్మ ఆలయానికి మొదటి స్థానం లభించింది.
అన్నవరానికి ఆరు
(ఆంధ్రజ్యోతి-అన్నవరం)
అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భక్తులను సంతృప్తిపరిచేలా వ్యవహరించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. ఆర్జేసీ కేడర్ కలిగిన ఆలయాల జాబితాలో ఏడు ప్రధాన ఆలయాలు ఉండగా అన్నవరం ఆలయానికి ఆరో స్థానం లభించింది. ఐవీఆర్‌ఎస్ సర్వేలో మొదటిప్రశ్నగా దర్శనం ఎలా జరిగిందని ప్రశ్నించగా 30.3 శాతం మంది సరిగా జరగలేదనే సమాధానమిచ్చారు. గంటలకొలదీ క్యూలైన్‌లో నిరీక్షించిన భక్తులను స్వామి దర్శన సమయంలో అక్కడ సేవకులు, సిబ్బంది గెంటేస్తున్నారు.ఈ ఆలయంలో డబ్బులిస్తేనే సకల సౌకర్యాలు జరుగుతాయని తేల్చారు. రెండో ప్రశ్న అన్నవరం ప్రసాదం విషయంలో 77.6 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా ఐదోస్థానానికి మాత్రమే పరిమితమైంది. పారిశుధ్య నిర్వహణలో 35.8 శాతం మంది అసం తృప్తి వ్యక్తం చేస్తూ ఆరో స్థానానికి పరిమితం చేశారు. శానిటేషన్ సిబ్బంది తమ పనిని పక్కనబెట్టి చేయిచాపడం భక్తులకు విసుగు తెప్పిస్తోంది. చివరిగా అడిగిన మంచినీటి సరఫరాపై ప్రశ్నకు 61.6 శాతం మంది మాత్రమే సంతృప్తి చెందడంతో ఆరోస్థానానికి పడిపోయింది.
తలుపులమ్మ లోవ 9
తుని రూరల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా డీసీ హోదా కలిగిన ఆలయాలకు ఇచ్చిన ర్యాంకింగ్‌లో కాకినాడ జిల్లా తుని మండలం లోవలో ఉన్న తలుపులమ్మ ఆలయానికి 9వస్థానం దక్కింది.ఆలయ పరిసరాల్లో శానిటేషన్, అధిక ధరలపై ఫిర్యాదు అందినట్టు సమాచారం. ఈ సమస్యను పరిష్కరించి భక్తులకు మెరుగైన సేవలందించాలని ఆదేశించడంతో ఆలయ అధికారులు ఆ వైపుగా చర్యలు చేపడుతున్నారు. భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్టు ఈవో విశ్వనాథరాజు తెలిపారు.
వాడపల్లి 6
ఆత్రేయపురం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలోనూ సౌక ర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రతి శనివారం 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఆలయంలో సేవలపై 66.5 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. 33.5 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వాడపల్లి ఆరో స్థానాన్ని దక్కించుకుంది. భక్తులకు మరిన్నీ మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పాలకులు కృషి చేయాలి.దర్శనం సకాలంలో అందించాలి.