చూడు..దేవుడా!?
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:19 AM
చూడు..దేవుడా ఎంత పని జరిగిందో.. నిన్ను చూద్దామని వస్తే.. నీ దగ్గరికే తీసుకెళ్లిపో యావు.. ఎవరిది తప్పయినా.. ఎవరిది నిర్లక్ష్యమైనా ఏమీ చేయలేని పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో పలు ఆలయాలు
అంతంతమాత్రంగా క్యూలైన్లు
రద్దీ పెరిగితే.. తప్పదు ముప్పు
కార్తీకమాసం.. కానరాని ఏర్పాట్లు
ఆదాయమున్నా.. సౌకర్యాలు సున్నా
కాశీబుగ్గ ఘటనతో ఉలికిపాటు
(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
చూడు..దేవుడా ఎంత పని జరిగిందో.. నిన్ను చూద్దామని వస్తే.. నీ దగ్గరికే తీసుకెళ్లిపో యావు.. ఎవరిది తప్పయినా.. ఎవరిది నిర్లక్ష్యమైనా ఏమీ చేయలేని పరిస్థితి.. అసలే కార్తీకమాసం.. ఆల యాల్లో తాకిడి భారీగా ఉంటున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన ఘటన భక్తులను ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే ఆ శివారు అంతర్వేది నుంచి ఈ శివారు అన్నవరం వరకు, వాడపల్లి నుంచి పెద్దాపురం తొలి తిరుపతి వరకు భక్తుల రద్దీ అంచనాలకు మించి ఉంటోంది. కాశీబుగ్గ ఘటనతో ఉమ్మడి తూర్పుగోదావరి వ్యాప్తంగా తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆలయాల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని దేవాలయాల వరకు భారీగా భక్తులు పోటెత్తితే తట్టుకునే క్యూలైన్ల సామర్థ్యం లేదు. కేవలం గర్భగుడికి కొంచెం సమీపంలో మినహా ఎక్కడా బలమైన రైలింగ్‌లు ఉండవు. దీంతో సజావుగా జరగాల్సిన దర్శనాలు అనుకోని ఘటనలు జరిగితే ఎక్కడ ఏ ప్రమాదం తెచ్చిపెడతాయోనన్న భయం వ్యక్తమవు తోంది. అసలే కార్తీకమాసం కావడంతో వాడపల్లి వెంకన్న ఆలయం మొదలు అన్నవరం, అంతర్వేది, పెద్దాపురం తొలి తిరుపతి తదితర ఆలయాలకు అంచనాలకు మించిన భక్తులు పోటెత్తుతున్నారు. కానీ వీటిలో క్యూలైన్ల రక్షణ వ్యవస్థ చూస్తే అంతంత మాత్రమే. అటు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని ఆలయాలకు ఇటీవల అనూహ్యంగా భక్తులు పోటెత్తుతున్నారు. తాజా ప్రమాద ఘటనతో ప్రైవేటు నిర్వహణలో ఉన్న ఆలయాలపైనా దేవదాయశాఖ తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పంచారామాల్లో పట్టించుకోండి..
ద్రాక్షారామ/సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పంచారామాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయా ల్సి ఉంది. జిల్లాలో పంచారామ క్షేత్రాలు రెండు ఉన్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, సామర్లకోట కుమారరామ భీమే శ్వరాలయాలు ఉన్నాయి. ద్రాక్షారామలో కార్తీకమాసం ఆరంభం నుంచి ఉచిత దర్శనం క్యూలైను తూర్పుగోపురం నుంచి ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్శనం రూ.50, విశిష్ట దర్శనం రూ.10 క్యూలైన్లు మార్పులు చేశారు. రూ.50 దర్శనం లైన్లు అంతరాలయంలోకి ప్రవేశం నిలిపివేశారు. మొదటి గుమ్మం నుంచి దర్శనం చేసుకునేలా ఏర్పాటుచేశారు. రెండు చోట్ల భక్తుల రద్దీని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
వాడపల్లి వెళ్లినా ఇబ్బందే!
ఆత్రేయపురం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి శనివారం సుమారు 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను విస్తరించినా అప్పుడప్పుడు తోపులాటలు జరుగుతున్నాయి. క్యూలైన్లలో భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే బయటకు వచ్చే మార్గంలేక ఇబ్బందులేర్పడుతున్నాయి. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఆలయంలో కానరావడం లేదు. ఆలయ ప్రాంగణంతో పాటు అన్నదానం నిర్వహించే ప్రదేశాలు రద్దీగానే ఉంటాయి. మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
రత్నగిరి..రద్దీకి ఏర్పాట్లేవి?
అన్నవరం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి ఆలయంలోనూ భక్తుల రద్దీ నియంత్రణపై అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ఈనెల 5న సత్యదేవుడి గిరిప్రదక్షణ జరగనుంది. ప్రతి ఏటా స్వామివారి గిరిప్రదక్షణ పల్లకీసేవ, సత్యరథం ఒకేసారి జరిగేవి. దీంతో భక్తులు ఒకేసారి పశ్చిమ రాజగోపురం వద్ద ఉండిపోవడంతో రద్దీ నియంత్రించలేక పశ్చిమ రాజగోపురం తలుపులు మూసివేసిన ఘటనలు జరిగాయి. ఈ ఏడాది సత్యదేవుడి గిరిప్రదక్షణ పల్లకిలో ఉద యం 8 గంటలకు.. సత్యరథంతో భక్తులు పాల్గొనేందుకు మధ్యాహ్నం 2గంటలకు గిరిప్రదక్షణ నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మధ్యాహ్నం సత్యరథం వెంబడి గిరిప్రదక్షణ అనే విషయం భక్తుల్లోకి పూర్తిగా చేరకపోవడంతో వారంతా ఉదయం పల్లకీ వెంట గిరిప్రదక్షణకు సిద్ధమవుతున్నా రు. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రత్నగిరిపై విపరీత రద్దీ ఉండే అవకాశాలున్నాయి. 2 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా.
తొలి తిరుపతి ఇబ్బందే మరి?
పెద్దాపురం,నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పెద్దాపురం మండలం దివిలిలో ఉన్న తొలి తిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. ప్రతీ శనివారం స్వామి దర్శ నానికి సుమారు 8 వేల నుంచి 10 వేల మంది భక్తులు వస్తారు. అయితే భక్తులకు సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నా యి. 2022 నవంబరులో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి పోటెత్తడంతో ఆలయం లోపల తొక్కిసలాట జరిగింది.దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు. భక్తులను నియంత్రించేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసినా ఆలయ పరిసరాలు ఇరుకుగా ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది.
అంతర్వేదిలో అత్యవసర ద్వారాల్లేవ్!
అంతర్వేది, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. విశేషమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. మాఘమాసంలో జరిగే స్వామివారి కల్యాణానికి, కార్తీకమాసంలో స్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక కూలైన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఆలయానికి లేకపోవడంతో ఇబ్బంది ఉంది.
క్యూలైన్లు లేవు.. పవన్ సారూ..
(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)
డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గం పిఠాపురంలో ప్రధాన ఆలయాలకు క్యూలైన్లు లేవనే చెప్పాలి. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయ ఆవరణలోనే క్యూలైన్లు 400-500 మంది భక్తులు వస్తే నిండిపోతాయి. పర్వదినాల్లో 10 వేల నుంచి 25 వేల మంది భక్తులు పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలకు, కుక్కుటేశ్వరస్వామి, శక్తి పీఠం పురుహూతికా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాల్లో సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఏర్పాట్లు లేవు.