Share News

మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు అమలాపురం వేదిక

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:28 AM

అమలాపురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపు

మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు అమలాపురం వేదిక
మహాసభల పోస్టర్‌ ఆవిష్కరించిన చైతన్యరాజు, ప్రభుత్వ విప్‌ సుబ్బరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో నిర్వహణ

పోస్టర్‌ ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు

పాల్గొన్న కిమ్స్‌ చైర్మన్‌ చైతన్యరాజు, ప్రభుత్వ విప్‌ దాట్ల, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

అమలాపురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కిమ్స్‌ ప్రాంగణం వేదిక కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 మార్చి 1వ తేదీన కిమ్స్‌ విద్యాసంస్థల ప్రాంగణంలో ఆ సంస్థ చైర్మన్‌ కేవీవీ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జరగనున్న తెలుగు మహాసభలకు సంబంధించి ఆదివారం కిమ్స్‌ కళాశాలలో పోస్టర్‌ ఆవిష్కరణ ఆర్భాటంగా జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీన జరిగే ఈ మహాసభలను ప్రతీ ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జిల్లాకే గర్వకారణంగా నిలిచే రీతిలో ప్రపంచానికి తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియచేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కలసికట్టుగా పనిచేస్తాం...

అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ మహాసభలను తాము బాధ్యతగా తీసుకుని 2రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు తామంతా కలసికట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఇక్కడకు సమీపంలోని ఆంధ్ర, గోవా, కోకో బీచ్‌లో ఏర్పాట్లను చేస్తున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రెస్టారెంటు, వాటర్‌ స్పోర్ట్స్‌, బీచ్‌ వాలీబాల్‌, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేకునేలా బీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సభలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మెట్ల రమణబాబుతో పాటు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పి.విజయలక్ష్మి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బోనం సత్తిబాబు, జనసేన నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు, కిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ పి.సుబ్బారావు, వైస్‌ ప్రెసిడెంట్‌ మోహనరాజు, ఎస్టీయూ నాయకులు దొరబాబు, పినిపే సత్యనారాయణ, బండారు రామ్మోహనరావు, ఎస్వీ నాయుడు మాట్లాడారు. రాజమహేంద్రవరం వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు 2 పర్యాయాలు నిర్వహించారని, మూడో పర్యాయం అమలాపురంలో నిర్వహించడానికి నిర్ణయించామని చైతన్యరాజు ప్రకటించడంతో పాటు సభల్లో విద్యార్థులకు తెలుగు భాషా ప్రావీణ్యంలో పలుఅంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం ద్వారా భాషాభిమానాన్ని పెంపొందించడానికి కీలకంగా ఉపయోగపడుతుందని నిర్వాహకులుపేర్కొన్నారు.

10వేల మందితో శోభాయాత్ర..

సభకు అధ్యక్షత వహించిన కేవీవీ చైర్మన్‌ సత్యనారాయణరాజు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను జిల్లా ఖ్యాతిని ప్రపంచదేశాల్లో ఇనుమడింపచేసేలా అమలాపురంలో నిర్వహిస్తామని తెలిపారు. 10వేల మందితో ఫిబ్రవరి 28న శోభాయాత్ర పట్టణంలో నిర్వహిస్తామన్నారు. వెయ్యి మందికి పైగా కవులతో సమ్మేళనం, వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం లతో సహాయ తెలుగుభాష కోసం పనిచేస్తున్న ప్రపంచంలో పేరెన్నిగన్న వ్యక్తులందరినీ ఈ వేదికపైకి పిలిచి సత్కరించనున్నట్టు తెలిపారు.

Updated Date - Dec 01 , 2025 | 12:28 AM