Share News

తెలుగు భాష..అమ్మ భాష

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:57 AM

అమ్మభాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. నన్నయ వర్శిటీలో శుక్రవారం తెలుగుభాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను నిర్వహించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌, గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటాలకు వీసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలుగు భాష..అమ్మ భాష
నన్నయ వర్శిటీలో గిడుగు, ధ్యాన్‌చంద్‌ చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

  • అందరం పరిరక్షించుకోవాలి

  • నన్నయ యూనివర్శిటీ వీసీ ప్రసన్నశ్రీ

  • ఘనంగా తెలుగు భాష, క్రీడా దినోత్సవాలు

  • విద్యార్థులకు పోటీలు..బహుమతులు

దివాన్‌చెరువు, ఆగస్టు29 (ఆంధ్రజ్యోతి) :అమ్మభాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. నన్నయ వర్శిటీలో శుక్రవారం తెలుగుభాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను నిర్వహించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌, గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటాలకు వీసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యం నుంచి భాషపై పట్టుసాధించాలని, తెలుగు భాష పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు చివరి కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేస్తూ లక్ష్యం వైపు వెళ్తున్న వారికి ఇబ్బందులు ఎదురవుతాయని వాటిని ధైర్యంగా అధిగమించాలని సూచించారు. ఆధునిక కాలంలో సోషల్‌ మీడియాసాధనాలు, కొత్తపోకడలు భాషలోని ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని యువత క్రీడలలో రాణించాలన్నారు. తెలుగు అధ్యాపకుడు తలారి వాసు తెలుగు భాష నేపథ్యాన్ని, గిడుగు రామ్మూర్తి కృషిని వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్స్‌ డి.జ్యోతిర్మయి, పి.విజయనిర్మల, కె.సుబ్బారావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ఎం.గోపాలకృష్ణ పాల్గొన్నారు. నామవరంలోని భారతీయ విద్య భవన్స్‌లో తెలుగు తల్లి, గిడుగు రామ్మూర్తి, ధ్యాన్‌చంద్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భువన విజయం లఘునాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సూర్యన్‌, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ హనుమంతరావు, తెలుగు, వ్యాయామోపాధ్యాయులు శరత్‌చంద్ర, తాతాజీ పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 12:57 AM