Share News

ఎవరికిస్తారో?

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:49 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాస్థాయి టీడీపీ ముఖ్యనేతల సమావేశం సోమవారం జిల్లా కేంద్రమైన అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జరిగింది. కీలక సమావేశానికి పార్టీ అధిష్ఠానం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు హాజరయ్యారు.

ఎవరికిస్తారో?
అమలాపురంలో జరిగిన జిల్లాస్థాయి టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర

త్రిసభ్య కమిటీ పరిశీలనలో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి

మంత్రి కొల్లు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఆంజనేయులు, టీఎన్‌టీయూ రాష్ట్ర అఽధ్యక్షుడు రఘురామరాజు భేటీ

పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ముఖాముఖి సమావేశాలు

ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాల నుంచి మూడేసి పేర్లు సిఫార్సు

అమలాపురం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాస్థాయి టీడీపీ ముఖ్యనేతల సమావేశం సోమవారం జిల్లా కేంద్రమైన అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జరిగింది. కీలక సమావేశానికి పార్టీ అధిష్ఠానం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర మైన్స్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ముఖ్యఅతిథులుగా హాజరైన ఈ కీలక సమావేశం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. జిల్లాస్థాయిలో పార్టీ అధ్యక్షుడి నియామకంతోపాటు వాటి అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న కీలక నాయకుల అభిప్రాయసేకరణ నిర్వహించారు. తొలుత జిల్లాలోని ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత త్రిసభ్య కమిటీ సభ్యులు జిల్లాలోని పార్టీముఖ్యనాయకులతో ముఖాముఖిగా చర్చించి వారి అభిప్రాయాలను మంత్రి కొల్లు రవీంద్ర సహా మిగిలిన సభ్యులు కూలంకుషంగా నమోదు చేసుకున్నారు. జిల్లా కమిటీలకు సంబంధించి సిఫార్సులు చేసే నాయకుల పేరును నమోదు చేసుకుని వారికి సంబంధించి పార్టీశ్రేణుల మద్దతుపై కూడా నాయకుల నుంచి కీలకంగా రాబట్టారు.

సామాజికవర్గాలవారీగా పోటీ

కోనసీమ జిల్లాస్థాయి టీడీపీ అధ్యక్ష పదవికి దశాబ్ధాల కాలం నుంచి పనిచేస్తున్న సీనియర్‌ నాయకులనుంచి ఇటీవల పార్టీలోకి వచ్చిన నాయకుల వరకు ఎవరికి వారే తమ పేర్లను సిఫారసు చేయాలంటూ మంత్రి కొల్లు రవీంద్ర, చీఫ్‌ విప్‌ ఆంజనేయులు, రాష్ట్ర టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు రఘురామరాజులకు వివరించారు. ఓసీ సామాజికవర్గంనుంచి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, తెలుగు యువత నాయకుడు గంధం పల్లంరాజు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చెరుకూరి సాయిరామ్‌, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణసహా పలువురు పోటీపడినట్టు సమాచారం. మెట్ల రమణబాబు పేరు ఎక్కువమంది ఆమోదించినట్టు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్డ్‌ కులాలనుంచి అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్‌సాగర్‌, టీడీపీ రాష్ట్ర హెచ్‌ఆర్డీ సభ్యుడు నేదునూరి వీర్రాజు పేర్లు పరిశీలించగా అత్యధికులు ఎమ్మెల్యే ఆనందరావు కు మద్దతు తెలిపినట్టు సమాచారం. బీసీసామాజికవర్గం నుంచి ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్టీ జిల్లామహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, టీడీపీ కార్యదర్శి గుత్తుల సాయిశ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పెచ్చెట్టి చంద్రమౌళి పోటీపడినట్టు సమాచారం. వీరిలో రెడ్డిసుబ్రహ్మణ్యం, పెచ్చెట్టి విజయలక్ష్మి పేర్లకు అధికులు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అమలాపురం పార్లమెంటరీ తెలుగు రైతు విభాగం అధ్యక్షుడిగా మట్టా మహలక్ష్మిప్రభాకర్‌ పేరును పలువురు బలపరచగా ఆయన పేరు ఖరారైనట్టేనని సమాచారం. జిల్లాలో పారీ పదవులకు సంబంధించి పేర్లను త్రిసభ్య కమిటీ సేకరించి ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లకు నివేదించనున్నట్టు సమాచారం.

పార్టీ నేతల మనోభావాలను అధిష్ఠానం ముందు ఉంచుతా: మంత్రి కొల్లు

నేతల అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి కొల్లు రవీంద్ర హామీఇచ్చారు. పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రెడ్డి అనంతకుమారి అధ్యక్షతన నిర్వహించగా మంత్రి కొల్లు రవీంద్ర, చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, టీఎన్‌టీయూసీఅధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామ రాజుతోపాటు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్‌బాలయోగి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావుతోపాటు జడ్పీ మాజీచైర్మన్‌ నామన రాంబాబు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు,రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు,నాయ కులు మోకా ఆనంద్‌సాగర్‌, పెచ్చెట్టి చంద్రమౌళి, పలువురు నేతలు ప్రసంగించారు.

Updated Date - Aug 26 , 2025 | 01:49 AM