సరుకు దొరికింది... సంగతి తేలాలి!
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:44 AM
ఆయిల్ ప్యాకెట్ల లోడు లారీ చోరీ కేసులో ఐదుగురు వ్యక్తుల పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే లారీ దొరకగా, వివిధ ప్రాంతాలకు తరలించిన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ల స్టాకుతో పాటు, అందుకు వినియోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు వారి గత చరిత్రపై దృష్టి పెట్టారు. వారికి గల రాజకీయ సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
పిఠాపురంలో చోరీ అయిన సన్‌ఫ్లవర్
ఆయిల్ ప్యాకెట్ల స్టాకు స్వాధీనం
సరుకు తరలించిన వాహనాల సీజ్
ఐదుగురి పాత్ర ఉన్నట్టు గుర్తింపు
వారి గత చరిత్రపై విచారణ
పిఠాపురం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఆయిల్ ప్యాకెట్ల లోడు లారీ చోరీ కేసులో ఐదుగురు వ్యక్తుల పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే లారీ దొరకగా, వివిధ ప్రాంతాలకు తరలించిన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ల స్టాకుతో పాటు, అందుకు వినియోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు వారి గత చరిత్రపై దృష్టి పెట్టారు. వారికి గల రాజకీయ సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
అసలేం జరిగిందంటే...
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయిల్‌ప్యాకెట్లు లోడుతో ఉన్న లారీ 2 రోజుల క్రితం చోరీ కావడం సంచలనం కలిగించింది. కాకినాడలోని జెమిని ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి రూ.28లక్షలు విలువైన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు లోడుతో ఉన్న లారీని పిఠాపురం తీసుకువచ్చి ఈనెల 5న రాత్రి పార్కు చేయగా దానిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. సరుకుతో సహ లారీ మాయమైన విషయాన్ని బుధవారం ఉదయం గుర్తించిన లారీ ఓనర్ కమ్ డ్రైవర్ దగ్గు అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 6న ఉదయం 11గంటల సమయంలో ఖాళీ లారీని తుని సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద గుర్తించారు. అందులో సరుకు లేకపోవడంతో సరుకు ఎక్కడ డంప్ చేశారనే విషయంలో పోలీసులు విచారణ చేపట్టారు. గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు, అక్కడ ఒక వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వచ్చి టోల్‌ఫీ చెల్లించడం తదితర విషయాలను గుర్తించి విచారణ సాగించగా సరుకు ఎక్కడెక్కడ దింపారో వెల్లడైంది. కత్తిపూడి శివారు, మండపం సమీపంలో మామిడితోటల్లో బోలెరో, టాటా మేజిక్ వాహనాలు, ట్రాక్టర్ల ద్వారా సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను తరలించి నిల్వ చేసినట్టు గుర్తించారు. వీటిని పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. ఇంకా మరికొంత సరుకు దొరకాల్సి ఉంది. ఈ సంఘటనలో పిఠాపురం పట్టణానికి చెందిన ఇద్దరు, పండూరుకు చెందిన ఒకరు, మండపం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్టు ఇప్పటి వరకూ గుర్తించారు. వారిలో కొందరు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయడమే లారీ యూనియన్ పదవుల కోసం ప్రయత్నించినట్టు చె బుతున్నారు. వీరు ఈ ఒక్క లారీ చోరీకే పాల్పడ్డారా, 3 రోజుల క్రితం జరిగిన నూ కల లోడు లారీ చోరీ సంఘటన, అంతకు ముందు జరిగిన గుట్కా ప్యాకెట్లు వాహ నం చోరీ తదితర సంఘటనలతో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వారి గత చరిత్రపై ఆరా తీస్తున్నారు. లారీని చోరీ చేసిన తర్వాత కొందరు వ్యక్తులు కారులో అనుసరించినట్టు సమాచారం. ఈ వాహనం ఎవరిది, కారులో ఎవరెవరు ఉన్నారు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
నాలుగు దర్యాప్తు బృందాల ఏర్పాటు
లారీ చోరీ సంఘటనపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 4 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్టు పిఠాపురం సీఐ శ్రీనివాస్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. లారీతో పాటు మాయమైన సరుకును గుర్తించామని తెలిపారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఆంధ్రజ్యోతి కథనంతో...
సన్‌ఫ్లవర్ ఆయిల్ లోడు లారీయే గాక గత ఆదివారం రాత్రి నూకలలోడు లారీ చోరీ కి గురైందని, జీపీఎస్ ఉండ డంతో రౌతులపూడి మండ లం గిడజాం వద్ద దానిని గు ర్తించారని ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై పోలీసులు ఇప్పుడు దృష్టిసారించారు. ఈ విషయాన్ని పోలీ సు ఉన్నతాధికారులు సీరియ స్‌గా తీసుకోవడంతో సదరు లారీ యజమాని వద్ద ఫిర్యా దు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లారీ ఎలా చోరీకి గురైందో ఆరా తీస్తున్నారు.