Share News

పిఠాపురంలో చోరీ.. తునిలో వదిలి పరారీ..

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:19 AM

పిఠాపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లోడుతో ఉంచి లారీ చోరీకి గురి కావడం సంచలనం కలిగించింది. అందులో ఉంచిన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను అపహరించి లారీని తుని సమీపంలో వదిలివేసి పరారయ్యారు చోరీకి పాల్పడిన ఆగంతకులు. కాకినాడలోని డైరీఫారమ్‌ సెంటర్‌కు చెందిన ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ దగ్గు అప్పారావు నగర శివారులోని జెమిని కంపెనీ వద్ద సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్లను తన లారీ

పిఠాపురంలో చోరీ.. తునిలో వదిలి పరారీ..
తుని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో వదిలివేసిన ఖాళీ లారీ

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లోడు లారీ అపహరణ

రూ.28 లక్షల విలువైన సరుకు మాయం

రెండు రోజుల క్రితం ఇదే తరహాలో సంఘటన

పిఠాపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లోడుతో ఉంచి లారీ చోరీకి గురి కావడం సంచలనం కలిగించింది. అందులో ఉంచిన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను అపహరించి లారీని తుని సమీపంలో వదిలివేసి పరారయ్యారు చోరీకి పాల్పడిన ఆగంతకులు.

కాకినాడలోని డైరీఫారమ్‌ సెంటర్‌కు చెందిన ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ దగ్గు అప్పారావు నగర శివారులోని జెమిని కంపెనీ వద్ద సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్లను తన లారీలో మంగళవారం సాయం త్రం లోడు చేసుకున్నాడు. లోడు లారీతో రాత్రి 8.30గంటల సమయంలో పిఠాపురం తీసుకువచ్చి వెలంపేటకు చెందిన డ్రైవర్‌ నాళం రమణకు అప్పగించాడు. లోడు ఒరిస్సాలోని భువనేశ్వర్‌ తీసుకువెళ్లాలని చెప్పి పిఠాపురంలోని కుంతీమాధవస్వామి ఆలయం సమీపంలో లారీని పార్కు చేశాడు. బుధవారం ఉదయం 5.30గంటల సమయంలో నాళం రమణ వచ్చి చూసుకునే సరికి లారీ మాయమైంది. గుర్తుతెలియని ఆగంతకులు లారీతో ఊడాయించినట్టు గుర్తించాడు. వెంటనే యజమానికి దగ్గు అప్పారావుకు సమాచారం అందించాడు. అందులో రూ.28లక్షలు విలువైన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ప్యాకెట్లు ఉండడంతో అప్పారావు పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీం తో పోలీసులు సీసీ కెమెరాలు, గొల్లప్రోలు టోల్‌గే టు వద్ద రికార్డులు, అక్కడ ఉన్న కెమెరాలు పరిశీలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.27గంటలకు టోల్‌గేట్‌ దాటినట్టు గుర్తించారు. ఫాస్టాగ్‌ ద్వారా కాకుండా టోల్‌ఫీజును నగదు రూపంలో చెల్లించారు. దీంతో సమీపంలోని అన్ని పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. ఉదయం 11 గంటల సమయంలో లారీని తుని సమీపంలో 16వ జాతీయ రహదారిపై గల ప్లైఓవర్‌ బ్రిడ్జి స మీపంలో వదిలివేసినట్టు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు వెళ్లి చూడగా అందులో సరుకు పూర్తిగా మాయమైంది. ఖాళీ లారీ మాత్రమే అక్కడ ఉంది. అందులోని సరుకును గొల్లప్రోలు-తుని మధ్య ఎక్కడో చోరీకి పాల్పడిన ఆగంతకులు డంప్‌ చేసి లారీని వదిలివేసి పరారైనట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన పిఠాపురం పరిసర ప్రాంతాల్లో తీవ్ర సంచలనం కలిగించడంతో పాటు చర్చనీయాంశంగా మారింది. సన్‌ఫ్లవర్‌ లోడు లారీని ఆగంతకులు ఎలా గుర్తించారు, ఇ ది తెలిసున్న వారి పనా, లేకుంటే లారీని ఫ్యాక్టరీ నుంచి ఫాలో అవుతూ వచ్చిన వారు ఈ సంఘటనకు పాల్పడ్డారా అని అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా లారీని ఆగంతకు లు తీసుకువెళ్తున్న సమయంలో ఒకవ్యక్తి మోటార్‌సైకిల్‌పై టోల్‌గేట్‌ దాటే వరకూ వెన్నంటి ఉండటం పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసుల తీరుపై విమర్శలు

చోరీలు అధికమవుతున్నా పోలీసులు సరైన నిఘా ఉంచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2రోజుల క్రితమే లారీ చోరికి గురై దొరికిన సంఘటన జరిగినా దానిపై పోలీసులు విచారణ జరపకపోవడం, రాత్రి పూట గస్తీ పెంచకపోవడంతో ఇటువంటి ఘటన వెనువెంటనే జరగడానికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిఠాపుంతో పాటు నియోజకవర్గం లో చోరీలు ఎక్కువైనా రాత్రిళ్లు నిఘా ఎందుకు ఉ ంచడంలేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మరో లారీ చోరీ...

పిఠాపురంలో ఇదే తరహాలో ఆదివారం రాత్రి ఒక లారీ చోరీకి గురైంది. డ్రైవర్స్‌కాలనీలోని టీడీపీ నాయకుడికి చెందిన నూకలలోడుతో ఉన్న లారీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. అయితే లారీకి జీపీఎస్‌ ఉన్న విషయాన్ని గుర్తించిన ఆగంతకులు తాము దొరికిపోతామనే భయంతో రౌతులపూడి మండలం గిడ జాం వద్ద వదిలి పరారయ్యారు. దీంతో సరుకుతో సహా సదరు నాయకుడు లారీని తెచ్చుకున్నారు.

Updated Date - Aug 07 , 2025 | 12:19 AM