మోరిలో రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:12 AM
అంతర్వేది, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో జానసుబ్బమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల ఫెన్సింగ్ టోర్నమెంట్ (ఎస్‌జీఎఫ్ అండర్-17) పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యా
13 జిల్లాల నుంచి పాల్గొన్న 312 మంది విద్యార్థులు
అంతర్వేది, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో జానసుబ్బమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల ఫెన్సింగ్ టోర్నమెంట్ (ఎస్‌జీఎఫ్ అండర్-17) పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి అతిథులు, విద్యార్థులు ఆహ్వానం పలికారు. జాతీయ జెండా వందనం అనంతరం జ్యోతిని వెలిగించి ఎమ్మెల్యే, డీఈవో క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీలు మోరి హైస్కూలులో జరగడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతీ విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రభుత్వం క్రీడల్లో తగిన విధంగా ప్రోత్సహిస్తుందని, విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి నెలకొల్పాలని డీఈవో సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి 312 మంది విద్యార్థులు పాల్గొనేందుకు విచ్చేశారు. జిల్లాకు 12 మంది బాలలు, 12 మంది బాలికలు చొప్పున 24 మంది వ్యక్తిగతంగా గ్రూప్ పోటీల్లో పాల్గొన్నారు. ఫెన్సింగ్ క్రీడలో 3 విభాగాలైన పాయల్, షాబర్, ఈపీలలో విజేతలైన మొదటి నాలుగు స్థానాలు సాధించిన 24 మందిని ఎంపిక చేసి డిసెంబరు 28, 29, 30 తేదీల్లో మహారాష్ట్రలోని శివాజీ షంభాజీ నగర్‌లో జరిగే జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేయనున్నట్టు క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ కడలి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో క్రీడల ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్, మోరిహైస్కూలు హెచ్ ఎం ఎస్.శ్రీధర్‌కృష్ణ, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఎంఈవోలు డి.కిశోర్‌కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, గుండుబోగుల పెద్దకాపు, ముప్పర్తి నాని, దిరిశాల బాలాజీ, గుబ్బల ఫణికుమార్, గెడ్డం మహలక్ష్మిప్రసాద్ పాల్గొన్నారు.