Share News

కాస్త ఊరట

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:46 AM

సోమవారం ఉదయం నుంచి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంది. వర్షాలు కురవకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చలి, ఈదురుగాలులు వీచడంతోపాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం పూట ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

కాస్త ఊరట
కాట్రేనికోన మండలంలో నీట మునిగిన వరి పొలాల వద్ద రైతు

  • తెరిపిచ్చిన వాన

  • ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • సాయంత్రం కొన్నిచోట్ల ఓమోస్తరు నుంచి భారీ వర్షం

అమలాపురం, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): సోమవారం ఉదయం నుంచి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంది. వర్షాలు కురవకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చలి, ఈదురుగాలులు వీచడంతోపాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం పూట ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అల్పపీడనం కారణంగా అధికారులు ముందు జాగ్రత్తగా కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మిగిలిన జిల్లాలన్నింటికీ ఆదివారం రాత్రికే సోమవారం స్కూళ్లకు సెలవు అని ప్రకటించినప్పటికీ కోనసీమ జిల్లాలో మాత్రం సోమవారం ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో కొన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు యథావిధిగా పాఠశాలలకు చేరుకున్నారు. ఆ తరువాత విద్యాశాఖ అధికారులు జారీచేసిన ఉత్తర్వుల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యార్థులను పంపించి వేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా తలెత్తిన సమస్యతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనం అవస్థలు పడుతుండగా, చేలు ముంపులో చిక్కుకున్నాయి. రైతులు నానాపాట్లు పడుతున్నారు.

  • అత్యధికంగా ఉప్పలగుప్తంలో..

జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం తెల్లవారుజాము వరకు కరిసిన వర్షపాతం జిల్లాలో అత్యధికంగా 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం ఉప్పలగుప్తంలో నమోదైంది. అత్యల్పంగా 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం సఖినేటిపల్లి మండలంలో నమోదు కాగా జిల్లాలో 26.7 మిల్లీమీటర్ల వర్షపాతం సగటున నమోదైంది. ఆత్రేయపురం మండలంలో 24. 4మిల్లీమీటర్ల, మండపేట 21.6, రాయవరం 26, రామచంద్రపురం 26.2, ఆలమూరు 28.2, రావులపాలెంలో 23.4, కొత్తపేట 26.4, కపిలేశ్వరపురం 30.2, కె.గంగవరం 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఐ.పోలవరంలో 37.4 మిల్లీమీటర్ల, ముమ్మిడివరం 28.23, అయినవిల్లి 32, పి.గన్నవరం 22.8, అంబాజీపేట 26.4, మామిడికుదురు 22.2, రాజోలు 19.6, మలికిపురం 25.4, అల్లవరం 25.8, అమలాపురం 24.4, కాట్రేనికోన 33.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు.

Updated Date - Aug 19 , 2025 | 01:46 AM