ప్రతీ అర్జీకి సమాధానమివ్వాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:28 AM
ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి వచ్చిన ప్రతీ అర్జీకి అర్థవంతమైన సమాధానమివ్వాలని జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఆమె పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
కలెక్టర్ ప్రశాంతి
కార్పొరేషన్ పీజీఆర్‌ఎస్‌లో 15 అర్జీల స్వీకరణ
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 23(ఆంధ్ర జ్యోతి): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి వచ్చిన ప్రతీ అర్జీకి అర్థవంతమైన సమాధానమివ్వాలని జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఆమె పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 15 అర్జీలు వచ్చాయని, వాటిలో ఇంజనీరింగ్ విభాగానికి 4, టౌన్ ప్లానింగ్‌కు 4, వార్డు సచివాలయాలకు 4, పబ్లిక్ హెల్త్‌కి ఒకటి, మెప్మాకు రెండు వచ్చాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధి కారులను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం వచ్చిన అర్జీలు శనివారానికి క్లోజ్ అయ్యేలా ఆయా శాఖల విభాగాధిపతులు చొరవ చూపాలన్నారు. అలాగే వర్షాల వల్ల ఖాళీ స్థలాల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడతారని అటువంటి పరిస్థితుల లేకుండా చూడాలన్నారు. నిర్మాణాలు చేపట్టిన స్థలాలను ఎత్తుచేసుకునేలా యజమానులకు నోటీసులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, సెక్రటరీ జి.శైలజావల్లి, ఎస్‌ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఎంహెచ్‌వో డాక్టర్ వినూత్న తదితరులు పాల్గొన్నారు.
జనన, మరణ నమోదు నూరుశాతం జరగాలి: కలెక్టర్
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో జనన, మరణ నమోదు నూరుశాతం జరగాలని కలె క్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న ‘పేరు నమోదు చేయలేదా చచ్చామే శీర్షికన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం కార్పొరేషన్‌లో పబ్లిక్ హెల్త్ విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది సంఖ్యపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. సర్టిపికెట్ జారీ గడువు వివరాలు తెలుసుకున్నారు. డ్యాష్ బోర్డును పరిశీలించారు. పెండింగ్ అప్లికేషన్లపై ఆరా తీశారు. మరణ ధ్రువపత్రం జారీకి మరణానికి గల కారణాన్ని తప్పక నమోదు చేయాలన్నారు. అత్యంత సరళీకృతంగా ధ్రువీకరణ పత్రాల జారీకి అధికారులు కృషిచేయాలని సూ చించారు. జనన, మరణ ధ్రువపత్రాల కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు.