సహకార రైతులపై ఉక్కి పిడికిలి!
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:34 AM
డీసీసీబీ బ్యాంకు పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 298 సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా కోనసీమ జిల్లాలో 166, తూర్పులో 49, కాకినాడలో 72, అల్లూరి జిల్లాలో 11 సొసైటీలున్నాయి.
నిబంధనల పేరిట వడ్డీ రేటు పెంచేలా డీసీసీబీ ప్రణాళిక
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ దాటి రుణం పొందితే 11 శాతం వడ్డీ
పంట రుణాలు మంజూరు చేయాలంటే ఫీల్డ్ విజిట్ తప్పనిసరి
ఉత్తర్వులు జారీచేసిన డీసీసీబీ సీఈవో
ఆందోళన చెందుతున్న రైతులు
వ్యవసాయ సాగులో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులపై ఇప్పుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కూడా ఉక్కు పిడికిలి బిగించింది. నిబంధనల పేరిట వడ్డీ రేటును పెంచుతూ రైతులపై అధిక భారం మోపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తాల్లో రుణాలు పొందిన రైతుల నుంచి 7 శాతం వడ్డీకి బదులు 11శాతం వడ్డీ రేటును వసూలు చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈవో గతనెల 30న ఇచ్చిన సర్క్యులర్ ఇప్పుడు రైతుల్లో చర్చనీయాంశమైంది. వడ్డీ రేట్లను పెంచుతూ డీసీసీబీ ఇచ్చిన ఉత్తర్వులపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలను రుణాల రూపంలో తీసుకుని సొసైటీలను నిలువునా ముంచేయడంలో కొందరు ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల నేతలు కీలకపాత్ర వహించడం వల్ల డీసీసీబీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలు వర్తింపచేయడం ద్వారా 11శాతం వడ్డీని వసూలు చేయాలని డీసీసీబీ సర్క్యులర్‌ను సొసైటీలకు జారీచేసింది. అలాగే పలు నిబంధనలను అమలులోకి తేవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
(అమలాపురం - ఆంధ్రజ్యోతి)
డీసీసీబీ బ్యాంకు పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 298 సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా కోనసీమ జిల్లాలో 166, తూర్పులో 49, కాకినాడలో 72, అల్లూరి జిల్లాలో 11 సొసైటీలున్నాయి. గతంలో పాలకుల తప్పిదాలు, స్కామ్‌ల వల్ల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటితోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న సొసైటీల్లో కూడా రుణాల దుర్వినియోగంపై విచారణ కూడా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో గతనెల 30న డీసీసీబీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. 2025-26 సంవత్సరానికి బ్యాంకు ద్వారా సొంత భూములపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే అధికంగా పంట రుణాలు మంజూరుచేసిన రుణాల మొత్తానికి (ఏ ఎఎస్‌ఏవో) సంబంధించి ఈ ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి సొసైటీల ద్వారా వ్యవసాయదారులకు ఎంసీ ఎల్ పద్ధతిలో పంట రుణాలను మంజూరు చేస్తున్నారు. ఆప్కాబ్ నుంచి పంట రుణాలు మంజూరుచేసిన మొత్తానికి రాయితీ వడ్డీ రేటుకు రీఫైనాన్స్ చేయడం లేదు. కానీ బ్యాంకు ద్వారా సంఘానికి 5.75శాతం వడ్డీకి పంట రుణాలు మంజూరు చేయడంవల్ల రైతు కేవలం 7 శాతం వడ్డీరేటుకి రుణం మంజూరు చేస్తారు. సకాలంలో రుణం తిరిగి చెల్లించిన రైతులకు 3శాతం వడ్డీ రాయితీ కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ ఈ వడ్డీ రాయితీ కేంద్రం నుంచి జమకావడం లేదని సమాచారం. సొసైటీల పరిధిలో రైతులకు ఉన్న సొంత భూములై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కన్నా ఎక్కువ మొత్తంలో పంటరుణాలు మంజూరు చేశారు. సొసైటీలు కంప్యూటరీకరణ పూర్తికావడంతో ఎంసీఎల్ పద్ధతిన రుణాలు మంజూరు చేయడం వల్ల గతంలో సొంత భూమిపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే అధిక మొత్తాల్లో రుణాలు పొందినట్టు గుర్తించారు. అలా అధిక మొత్తాల్లో రుణాలు పొందిన వారికి ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీగానీ, పంటల బీమా పథకంగానీ వర్తించదు. ఈ నిబంధనలు అమలు వల్ల ఖాతాదారుల అనుమతితో అడిషనల్ ఎస్‌ఏవోగా రుణాన్ని మార్పు చేయాల్సి ఉంది. ఆప్కాబ్ నుంచి రాయితీ వడ్డీ రేట్లకు రీఫైనాన్స్ రానందున కొత్త సభ్యులకు పంట రుణాలు మంజూరు చేయాలంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు రుణాన్ని పెంపుదల చేయాలన్నా, ఎడిషనల్ ఎస్‌ఏవోగా సహకార సంఘాలకు 9.75 వడ్డీ రేటుకు, సంఘం ద్వారా మెంబర్లకు 11 శాతం వడ్డీరేటుకు పంట రుణాలు మంజూరు చేయాలన్నా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
రుణం పొందాలంటే.. సవాలక్ష నిబంధనలు
రుణ ప్రణాళిక అమలులో కచ్చితంగా నిబంధనలు పాటించాలని కాకినాడ డీసీసీబీ బ్యాంకు సీఈవో జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పంట రుణానికి సంబంధించి ఎడిషనల్ ఎస్‌ఏవో వడ్డీరేటు 9.75శాతం(సహకార సంఘాలకు), 11శాతం సంఘం ద్వారా సభ్యునికి పీనల్ వడ్డీ 2శాతంగా నిర్ణయించారు. రుణ కాలవ్యవధిని ఏడాదిగా నిర్ణయించారు. వయోపరిమితి 15 నుంచి 65ఏళ్లు కలిగిన రైతులు వ్యక్తిగత రుణ పరిమితిని రూ.3 లక్షలకు పరిమితం చేశారు. షేర్ ధనాన్ని రుణం మొత్తంపై 10 శాతంగా నిర్ణయించారు. ఫిషరీస్ డైరీ ప్రయోజనాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పెట్టుబడి రుణాలు మంజూరుచేయాలి. రుణాలు మంజూరు చేసేటప్పుడు రైతుల నుంచి సొంత భూమికి సంబంధించి బ్యాంకు ఎస్‌ఏవో పాలసీలో పొందుపరిచిన అన్ని ముఖ్యపత్రాలతోపాటు ఇ-క్రాప్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఖాతాదారుల మార్పుగేజ్ వివరాలు, డిక్లరేషన్ బాండ్ రిజిస్టర్‌లో పొందుపరిచి భద్రపరచాలి. సొసైటీల పరిధిలో సీఈవో, సూపర్‌వైజర్, రైతు సమక్షంలో షీల్డ్ విజిట్ చేసి రైతు పండించే భూములు, పంటలకు సంబంధించి జీపీఎస్ ఫొటోను తీసుకుని ఏఎస్‌ఏవో ఫైలు నందు ఇతర డాక్యుమెంట్లతో భద్రపరచాలి. షాడో రిజిస్టర్ నిర్వహించాలి. కొత్త సభ్యులకు పంట రుణాలు మంజూరు చేయాలంటే జూన్ నాటికి ఆ సంఘం పరిధిలో 80శాతం పైబడి పంట రుణాలు రికవరీ ఉంటేనే కొత్తరుణాలు మంజూరు చేయాలి. ఇలా డీసీసీబీ విధించిన తాజా ఆంక్షలతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.