Share News

అధికంగా సిజేరియన్‌ ప్రసవాలు చేస్తే చర్యలు

ABN , Publish Date - May 22 , 2025 | 01:03 AM

నార్మల్‌ ప్రసవాలు అయ్యేలా ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావుదొర సూచించారు.

అధికంగా సిజేరియన్‌ ప్రసవాలు చేస్తే చర్యలు

ముమ్మిడివరం, మే 21(ఆంధ్రజ్యోతి): నార్మల్‌ ప్రసవాలు అయ్యేలా ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావుదొర సూచించారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం జిల్లాలో అధికంగా సిజేరియన్‌ ప్రసవాలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్య గైనకాలజిస్టులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. సిజేరియన్‌ ప్రసవాల వల్ల తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దానివల్ల మాతృత్వ మరణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, నార్మల్‌ ప్రసవాలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్‌ ప్రసవాలు చేసే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ గైనకాలజిస్టు డాక్టర్‌ సత్యవేణి సిజేరియన్‌ ప్రసవాలపై జరిగే అనర్థాలను వివరించి, నార్మల్‌ ప్రసవాలు జరిగేలా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచనలిచ్చారు. ప్రైవేటు యాజమాన్య ఆసుపత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలు ఎక్కువ జరుగుతున్నట్టు దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేటు యాజమాన్య ఆసుపత్రులు, గైనకాలజిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ సీహెచ్‌వీ భారతిలక్ష్మి, డాక్టర్‌ టీకే శ్రీనివాసరావు, డాక్టర్‌ బీవీవీ సత్యనారాయణ, కె.వీరబాబు, ఎన్‌.రవి పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 01:03 AM