Share News

రాజ్యాంగం రక్షించబడాలంటే ఏకాత్మను అర్థంచేసుకోవాలి

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:25 AM

రాజ్యాంగం రక్షించబడాలంటే ఏకాత్మను అర్థం చేసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

రాజ్యాంగం రక్షించబడాలంటే ఏకాత్మను అర్థంచేసుకోవాలి

రాజమహేంద్రవరం కల్చరల్‌, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి): రాజ్యాంగం రక్షించబడాలంటే ఏకాత్మను అర్థం చేసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని ఆంధ్రకేసరి సెంటినరీ రోటరీ హాలులో ప్రకాశం అభివృద్ధి, అధ్యయన సంస్థ - ఆంధ్రకేసరి యువజన సమితి సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మాధవ్‌ మాట్లాడుతూ అత్యంత మేథస్సు కల్గిన వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని అన్నారు. కాలంలో అవసరమైన మార్పులు చేసుకుంటూ దేశ ప్రయోజనాలకోసం నిర్ణయాలు తీసుకోవాలని డాక్టర్‌ అంబేడ్కర్‌ సూచించారని అన్నారు. అనేక కులాలు, మతాలు, ప్రాంతీయతలు ఉన్నా దేశంలో అందరూ భిన్నమే అని ఇక్కడ ఏకాత్మత సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య అన్ని అంశాల్లోనూ సమన్వ యం అవసరమన్నారు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని భారతీయులంతా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా రేషన్‌కార్డులు, పింఛన్లు వంటి ఆలోచనలతో సాగడం రాజ్యాంగ స్ఫూర్తికి అవరోధం కల్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ త్యాగమే పెట్టుబడిగా ఆనాడు ప్రకాశం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షుడు వి.భాస్కరరామ్‌ సభకు అధ్యక్షత వహించారు. ప్రకాశం అభివృద్ధి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ పి.మోహనరావు, విజయవాడ లయోలా కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, సంస్థ ప్రధాన కార్యదర్శి టంగుటూరి శ్రీరామ్‌, ఆంధ్రకేసరి యువజన సమితి ప్రధాన కార్యదర్శి సీపీ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 01:25 AM