శంకరగుప్తం డ్రెయిన్ మరమ్మతులకు రూ.21 కోట్లు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:33 AM
రాజోలు నియోజకవర్గంలోని ప్రధానమైన శం కరగుప్తం డ్రెయిన్ సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. చాలాకాలంగా ఈ సమస్య జఠిలంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, రైతుల సంఘాల నాయకులు ఈ విషయాన్ని పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఆర్థికశాఖకు ప్రతిపాదన పంపిస్తున్నాం : మంత్రి నిమ్మల
రామానాయుడుకు నివేదిక అందించిన నిపుణుల కమిటీ
అమరావతిలో ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో మంత్రి సమీక్ష
అమలాపురం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాజోలు నియోజకవర్గంలోని ప్రధానమైన శం కరగుప్తం డ్రెయిన్ సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. చాలాకాలంగా ఈ సమస్య జఠిలంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, రైతుల సంఘాల నాయకులు ఈ విషయాన్ని పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సోమవారం అమరావతిలోని సచివాలయంలో ఈ సమస్య పై ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సీఈ, ఈఈలతో పాటు ఇతర అధికారులతో మంత్రి కీలకంగా సమీక్షించారు. వాస్తవానికి గతంలోనే శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను మంత్రి రామానాయుడు స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించి పరిశీలించారు. ఈ డ్రెయిన్‌లోకి ఉప్పునీరు రావడం వల్ల సమీపంలో ఉన్న వేల కొబ్బరిచెట్లు చనిపోయి రైతులకు చాలా నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే శంకరగుప్తం డ్రెయిన్ ప్రాంతాన్ని గత నెలాఖరున డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారని అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి క్షణంలో పవన్ పర్యటన వాయిదా పడింది. తదనంతరం శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై మరోసారి జలవనరులశాఖ మంత్రి రామానాయుడు ఇటీవల అధికారులతో చర్చించారు. కొబ్బరి రైతుల సమస్యల దృష్ట్యా ఈ కీలక సమస్య పరిష్కారానికి ఆ సందర్భంగా ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని నియమించారు. శంకరగుప్తం డ్రెయిన్ స్థితిగతులు, ముంపునకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి రామానాయుడు ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ పరిశీలన చేపట్టింది. సముద్రపు అలలతో ముంపునకు గురవుతున్న కేశవదాసుపాలెం, శంకరగుప్తం, పడమటిపాలెం, కేశనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం, కరవాక గ్రామాలను పరిశీలించి కమిటీ నివేదికను మంత్రి రామానాయుడుకు అందజేశారు. శంకరగుప్తం డ్రెయిన్ ద్వారా సముద్రపునీరు వెనక్కి రావడంతో వేలాది ఎకరాల్లో పంటనష్టం కలుగుతుందని తెలిపారు. నివేదిక ఆధారంగా శంకరగుప్తం డ్రెయిన్‌ను పరిష్కరించడానికి రూ.21కోట్ల మంజూరుకు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు మంత్రి తెలిపారు.