భద్రాచలం వరకూ ఫ్రీ!
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:50 AM
స్త్రీ శక్తి పథకాన్ని జిల్లాలో మరింత విస్తృతం చేయనున్నారు. కొన్ని అంతర్రాష్ట సర్వీసులను ఎన్‌క్లేవ్ సర్వీసులుగా పరిగణించనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వరకూ ఫ్రీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : స్త్రీ శక్తి పథకాన్ని జిల్లాలో మరింత విస్తృతం చేయనున్నారు. కొన్ని అంతర్రాష్ట సర్వీసులను ఎన్‌క్లేవ్ సర్వీసులుగా పరిగణించనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వరకూ ఫ్రీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరం డిపో నుంచి 9 బస్సులు, గోకవరం డిపో నుంచి 3 బస్సులు భద్రాచలం వరకూ నడుపుతున్నారు. వీటిని అంతర్రాష్ట్ర సర్వీసులుగా పరిగణిస్తూ స్త్రీ శక్తి ఉచిత ప్రయాణాన్ని అనుమతించడంలేదు. దీంతో టిక్కెట్ తీసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. భద్రాచలం వరకూ నడుస్తున్న ఈ బస్సులను కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎటపాక వరకూ కొనసాగిస్తే ఎన్‌క్లేవ్ సర్వీసులుగా పరిగణింపబడతాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వ అధికారవర్గాలు భద్రాచలం రూటును ఎన్‌క్లేవ్ సర్వీసులుగా మార్చేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో జిల్లాకు చెందిన వారితో పాటు రాష్ట్రానికి చెందిన స్త్రీలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఎటపాక వరకూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన కొన్ని మార్గదర్శకాలను సడలించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి జిల్లా ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వులు అందితే మంగళవారం నుంచే ఈ సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం అనుమతించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్‌ఎన్ మూర్తి, సిబ్బందితో కలసి సోమవారం భద్రాచలం బస్సు రూటును స్వయంగా పరిశీలించారు.