Share News

ధాన్యం సేకరణకు అంతా సిద్ధం

ABN , Publish Date - Nov 14 , 2025 | 02:31 AM

ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి వ్యయ ప్రయాసలకోర్చి పండించిన ధాన్యం సేకరణకు జిల్లా సివిల్‌ సప్లయిస్‌శాఖ సమాయత్తమైంది.

ధాన్యం సేకరణకు అంతా సిద్ధం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి వ్యయ ప్రయాసలకోర్చి పండించిన ధాన్యం సేకరణకు జిల్లా సివిల్‌ సప్లయిస్‌శాఖ సమాయత్తమైంది. ముందస్తు ప్రణాళికలతో జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అప్పుడే శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 మండలాల పరిధిలో ఇప్పటికే మండపేట, రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 2025-26 సంవత్సరంలో ఖరీఫ్‌ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం ఆధారంగా 4.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. స్థానిక వినియోగానికిపోగా మిగిలిన 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖరీఫ్‌ ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యంగా సివిల్‌ సప్లయిస్‌శాఖ నిర్ణయించింది. ఇందుకోసం కోనసీమ జిల్లావ్యాప్తంగా 204 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటికే 68 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టారు. ధాన్యం సేకరించేందుకు 85 లక్షల గోనె సంచులను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 2వేల వాహనాలను ధాన్యం కొనుగోలు కోసం సిద్ధంచేయాలని ప్రణాళికలు రూపొందించగా, 1300 వాహనాలకు జీపీఎస్‌ రిజిస్ర్టేషన్‌ను పూర్తి చేశారు. రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారుల సమన్వయ పర్యవేక్షణతో కొనుగోలు చేపట్టాలని జిల్లా అధికారులు ఇప్పటికే సూచించారు. జిల్లాలో 151 రైసుమిల్లులకు లక్ష్యాన్ని నిర్ణయించారు. అంతేకాకుండా గతంలో ధాన్యం కొనుగోలులో జిల్లాని అగ్రగామిగా నిలిపిన రీతిలోనే ఖరీఫ్‌ సీజన్‌లో కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పంట సీజన్‌లో ధాన్యానికి రూ.69 మద్దతు ధర పెంచారు. గోనె సంచులకు రూ.4.74 అద్దెగా నిర్ణయించారు. ధాన్యం విక్రయించిన ఆర్‌ఎస్కే (రైతు సేవా కేంద్రం) నుంచి రైసుమిల్లులకు చేరేవరకు ఒకే కంపెనీకి చెందిన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత తుఫాన్‌ సీజన్‌లో జిల్లాలో 72 వేల ఎకరాలకు నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేసినప్పటికీ రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ కొనుగోలు జరగాల్సిందేనని అధికారులు స్ప ష్టంచేశారు. దీనిలో భాగంగా ధాన్యం సేకరణకు కొన్ని మార్గదర్శకాలు నిర్ణయించారు. ఈ మేరకు ఏ గ్రేడ్‌ రకాన్ని క్వింటాల్‌ రూ. 2389గాను, సాధారణ రకం (కామన్‌) రూ. 2369గా ధర నిర్ణయించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లాస్థాయిలో కంట్రోల్‌ రూం నంబరు 8309432487, 94416 92275, టోల్‌ఫ్రీ నంబరు 1967ను సంప్రదించాలని రైతులకు అధికారులు సూచించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు జమచేయాలని నిర్ణయించారు.

Updated Date - Nov 14 , 2025 | 02:31 AM