రెడ్ అలర్ట్
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:19 AM
జిల్లాలో ఆదివారం భారీవర్షం కురుస్తూనే ఉంది. అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం జిల్లావాసులను వణికించింది. కొన్నిరోజులుగా వేసవిని తలపించే వాతావరణంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
ఒకవైపు భారీవర్షాలు.. మరో రెండు, మూడురోజులు ఇదే పరిస్థితి
అల్పపీడనం ప్రభావంతో ఆదివారం రోజంతా భారీవర్షం
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర మధ్య రేపు తీరం దాటే అవకాశం
ఆ ప్రభావంతో రాష్ట్రంలో కొనసాగనున్న భారీవర్షాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్
తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ
ఇప్పటికే వర్షాలకు మునిగిన పంటలు.. ఆందోళనలో రైతులు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఆదివారం భారీవర్షం కురుస్తూనే ఉంది. అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం జిల్లావాసులను వణికించింది. కొన్నిరోజులుగా వేసవిని తలపించే వాతావరణంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఆకాశానికి చిల్లుపడిందన్నట్టుగా కుండపోతగా ఆదివారం సాయంత్రం వరకు వాన పడుతూనే ఉండడం విశేషం. ఉదయం నుంచి కురిసిన వర్షానికి లో తట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాకినాడలోని శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో కాకినాడ నగరంలో రహదారులన్నీ జలమయమయ్యాయి.
తొండంగిలో అత్యధిక వర్షపాతం
జిల్లాలో ఉదయంనుంచి సాయంత్రం 5గంట ల వరకు మొత్తం 521.6 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది.తొండంగిలో అత్యధికంగా 39.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్య ల్పంగా గండేపల్లిలో 10.8 సెంటీమీటర్ల వర్షపా తం నమోదైంది. కోటనందూరులో 36.8, తుని లో 36.6, పిఠాపురంలో 36.2, ఏలేశ్వరం 26.6, కొత్తపల్లి 26.6, కాకినాడ రూరల్ 26.2, సామర్లకోట 25.4, ప్రత్తిపాడు 24.2, గొల్లప్రోలు 24.2, రౌతులపూడి 24.2, తాళ్లరేవు 23.2, కాకినాడ అర్బన్ 23.2, కాజులూరు 22.8, శంఖవరం 22.0, కిర్లంపూడి 21.4, కరప 21.2, పెద్దాపురం 19.2, పెదపూడి 17.2, జగ్గంపేట 14.2 సెం టీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అల్పపీడన ప్రభావంతో మరో మూడురోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడంతో కాకినాడ పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని రోజులపాటు కొ నసాగించనున్నట్టు విశాఖ తుపాను హెచ్చరిక ల కేంద్రం అధికారులు తెలిపారు. మత్స్యకారు లు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు ఈ వర్షాలు వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉంటాయని రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఒకటి, 23న మరొకటి
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే మూడురోజుల్లో కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీనుంచి అతిభారీవర్షాలు కురిసే ప్రమా దం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పే ర్కొంది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడొ చ్చని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనెల 23న బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండండి
అల్పపీడనం వాయువ్య దిశలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున వచ్చే 24 గంటల్లో కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భా రీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉం డాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోను ప్రజ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోను వాగులు, వంకలు వంటివి దాటే ప్రయ త్నం చేయవద్దన్నారు.
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ రద్దు
భారీవర్షాల నేపథ్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజాఫిర్యాధుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్టు కలెక్టర్ షాన్‌మోహన్ ప్రకటించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశామని కార్పొరేషన్ కమిషనర్ భావన తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ..
జిల్లాలో ఈరెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈనెల 18వతేదీ సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రద్దు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురి సింది. దీంతో ప్రజాజీవనం స్తంభించింది. వ్యాపారసంస్థలు మూతబడ్డాయి. భారీవర్షంతో జిల్లావ్యాప్తంగా వరిపొలాలు నీట మునిగి అన్నదాతలకు ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికితోడు పలుచోట్ల ప్రధానమైన డ్రైన్లతోపాటు మైనరు డ్రైన్లు వర్షపునీటితో నిండి పొంగి ప్రవహించడంవల్ల పంటపొలాల్లో వర్షపునీరు దిగే మార్గం లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
కంట్రోల్ రూముల ద్వారా సమీక్ష
రెండురోజులపాటు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ మహేష్‌కుమార్ హెచ్చరిక జారీ చేయడంతోపాటు కలెక్టరేట్ సహా ఆర్డీవోలు, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనికితోడు గోదావరిలో కూడా వరద నీటి మట్టం పెరుగుతోంది. లంక ప్రాంతాల్లోకి వరద ప్రవాహం చొచ్చుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం నాటి వర్ష ప్రభావంవల్ల జిల్లావ్యాప్తంగా అధికారులు ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులపై సమీక్షించారు. కొన్నిచోట్ల తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అప్రమత్తమయ్యారు. ఇరిగేషన్, డ్రైన్స్, రెవెన్యూ సహా ప్రభుత్వశాఖల ఉద్యోగులు వర్ష ప్రభావ ప్రాంతాల్లో పర్యటించారు.
వర్షాలతో జిల్లావ్యాప్తంగా పంట పొలాలు మునగడంతో ఇబ్బందులను పరిశీలించి చేలల్లో ఉన్న ముంపును బయటికి పంపించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కోనసీమలోని కొన్ని మండలాల్లో పంటచేలు మరోసారి ముంపునకు గురికావడంవల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ ప్రారంభ దశలోనే పంట పొలాల ముంపుతో తీవ్రమైన నష్టాలను కలగజేస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీవర్షాలవల్ల గోదావరినదికి వరదలు తీవ్రస్థాయిలో పోటెత్తుతాయని జలవనరులశాఖ నిపుణుల అంచనాలతో ప్రజలు, అధికారులు అప్రమత్తమవుతున్నారు.
మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో ఈనెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చేసిన హెచ్చరికలతో కోస్తా ఆంధ్ర పరిధిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఈనెల 18, 19 తేదీల్లో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెల్లకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు
-మత్స్యశాఖ అభివృద్ధి అధికారి
రాజోలు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మూడురోజులపాటు భారీనుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచనలమేరకు కలెక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆదేశాలతో ఈనెల 20 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు వెళ్లరాదని రాజోలు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్ గోపాలకృష్ణ కోరారు. ఈ సందర్భంగా రాజోలులో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మత్స్యకారులు బోట్లు, వలలను, ఇంజన్లను సురక్షితమైన ప్రదేశాల్లో జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నారు. భారీ వర్షాలకు చేప, రొయ్య రైతులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీవర్షాలకు చెరువులు నిండి గట్టు తెగిపోయే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తగా అడుగు లోపు నీటిని బయటకు మళ్లించాలన్నారు. బలహీనంగా ఉన్న గట్లను పటిష్టం చేసుకోవాలన్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు సూర్యరశ్మి లేకపోవడంవల్ల చెరువుల్లో ఉండే ఆక్సిజన్ స్థాయి తగ్గే ప్రమాదం ఉందన్నారు. వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడవచ్చునని, జనరేటర్లు, డీజిల్ ఇంజన్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
జిల్లాలో 11.6 సెంటీమీటర్ల
సగటున వర్షపాతం నమోదు
అమలాపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): అల్ప పీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో 256.2 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదైంది. సగటున 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా ఐ.పోలవరంలో 20.4 సెం.మీ., సఖినేటిపల్లిలో అత్యల్పంగా 5.4సెం.మీ వర్షపాతంనమోదైంది. ఆత్రేయపురంలో 20 సెం.మీ, మండపేట 10, రాయవరం 14.6, రామచంద్రపురం 6.8, ఆలమూరు 11.2, రావులపాలెం 15.2, కొత్తపేట 9.2, కపిలేశ్వరపురం 11.6, కె.గంగవరం 7.2, ఐ.పోలవరం 20.4, ముమ్మిడివరం 18.2, అయినవిల్లి 10.4. పి.గన్నవరం 8.6, అంబాజీపేట 9.2, మామిడికుదురు 8.4, రాజోలు 8.8,మలికిపురం 6, అల్లవరం 9.6,అమలాపురం 10.2, ఉప్పలగుప్తం 18.8, కాట్రేని కోనలో 16.4 సెం.మీ.వర్షపాతం నమోదైంది.