అక్రమాల ద్వారం తెరవాలని!
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:56 AM
కాకినాడ కేంద్రంగా సాగిన వందల కోట్ల రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై లోతైన విచారణకు రంగం సిద్ధమ వుతోంది. బియ్యం కుంభకోణంపై ఏర్పాటుచేసిన సిట్‌కు ప్రభుత్వం తాజాగా మరింత బలం కల్పించింది.
ఐదోసారి జీవో సవరణ
ఏకంగా పది మంది పోలీసులకు చోటు
సీఐడీ నుంచి నలుగురికి స్థానం
విశాఖ నుంచి ఏసీపీ శ్రీనివాసరావు
డీఎస్పీ హోదాలో నియామకం
ఐపీఎస్ ఆకే రవికృష్ణ నేతృత్వం
స్మగ్లింగ్‌పై లోతైన విచారణకు రెడీ
మార్పులు చేస్తున్నా దర్యాప్తు శూన్యం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కాకినాడ కేంద్రంగా సాగిన వందల కోట్ల రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై లోతైన విచారణకు రంగం సిద్ధమ వుతోంది. బియ్యం కుంభకోణంపై ఏర్పాటుచేసిన సిట్‌కు ప్రభుత్వం తాజాగా మరింత బలం కల్పించింది. స్కా మ్‌ను అన్ని కోణాల్లో లోతుగా విచారించడానికి వీలుగా సిట్ బృందంలో పలు మార్పులు చేసింది. ఈ మేరకు మంగళవారం కొత్తగా మరో జీవో జారీచేసింది. సిట్ లోకి పోలీసులు, విజిలెన్స్ కలిపి ఏకంగా పది మందిని చేర్చింది. వీరిలో నలుగురు రాజమహేంద్రవరం సీఐడీ అధికారులే ఉన్నారు. అయితే బియ్యం కుంభకోణంపై తొమ్మిది నెలల కిందట సిట్ బృందాన్ని నియమించగా.. ఇంత వరకు ఐదు సార్లు మార్పులు చేర్పులు చేశారు.
డొంక కదిలిందిలా...
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్కులు ఐదేళ్లలో భారీగా విదేశా లకు తరలించేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు బియ్యాన్ని కనివినీ ఎరుగని రీతిలో బొక్కేశారు. పేదల బియ్యాన్ని సార్టెక్స్ యంత్రాల్లో పాలిష్‌చేసి ఆఫ్రికా దేశాలకు అమ్మేసుకుని వేల కోట్లు గడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-2020లో కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి 19 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-2021లో 27 లక్షల మెట్రిక్ టన్నులు, 2021- 2022లో 29 లక్షల మెట్రిక్ టన్నులు, 2022-2023లో 38 లక్షల మెట్రిక్ టన్నులు, 2023-2024లో 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తరలిపోయింది. ఇందులో రేషన్ బియ్యం సగానికిపైనే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఆయన ప్రధాన అనుచరుడు వినోద్ అగర్వాల్‌కు చెందిన రెండు కంపెనీలు వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.4,995 కోట్ల విలువైన 13.41లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశా లకు విక్రయించాయి. గతేడాది నవంబరు ఆఖరులో కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశానికి స్టెల్లా నౌకలో రహస్యంగా ఎగుమతికి సిద్ధం చేసిన రేషన్ బియ్యం పట్టుబడడంతో స్మగ్లింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం కాకినాడకు వచ్చి స్వయంగా షిప్ వద్దకు వెళ్లారు.ఆ తర్వాత కాకినాడ, చుట్టు పక్క ప్రాంతాల్లో అనేక గోదాముల్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం పట్టుబడింది.
ఐదోసారి ఏమవుతుందో..
వేళ్లూనుకుపోయిన రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు 6న ఉక్కుపాదం మో పింది. ప్రత్యేకంగా సిట్‌ను నియమించింది. కాకినాడ చుట్టుపక్కల ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతేడాది జూన్, జూలై నెలల్లో 13 రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసు లు నమోదయ్యాయి. ఈ 13 కేసుల్లో రూ.84.87 కోట్ల విలువైన 22,947 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడిం ది. ఇందులో ద్వారంపూడి అనుచరులే అధికంగా ఉన్న ట్టు తేలింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ దర్యాప్తు పూర్తిగా నీరుగార్చేశారు. బ్రిజిలాల్ ఉన్నట్టుండి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లి పోవడంతో సిట్ ఆగి పోయింది. కుంభకోణం కథ కంచికే అనుకున్న తరు ణంలో మళ్లీ ప్రభుత్వం పాత సిట్‌ను పునర్వవ్యవస్థీ కరించింది. కొత్త బాస్‌గా ఐపీఎస్ అధికారి ఆకే రవి కృష్ణను నియమిస్తూ మే 7న మరో జీవో జారీ చేసింది. సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్పీ అయిన ఐపీఎస్ అధికారి బి.ఉమామహేశ్వర్, కాకినాడ బీసీ వెల్ఫేర్ ఈడీ ఏ. శ్రీనివాసరావు, కర్నూలు ఐసీడీఎస్ ఆర్జేడీ పి.రోహిణి, విజయనగరం డీఎస్‌వో కె.మధుసూదనరావు, కోనసీమ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఎం.బాల సరస్వ తిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కానీ మళ్లీ అదే తంతు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్యాప్తు ఊసే లేదు. గతేడాది డిసెంబరు నుంచీ సిట్‌ను నాలుగుసా ర్లు మార్చిమార్చి నియమించినా అసలు విచారణ జర గకపోవడం అనుమానాలకు తావిచ్చింది. అంతా మర్చి పోయారనుకున్న తరుణంలో ప్రభుత్వం మంగళవారం మళ్లీ కొత్త జీవో జారీచేసింది. ఇప్పుడున్న సిట్ బృం దానికి తోడుగా మరో పది మంది పోలీసులను అద నంగా నియమిస్తూ రాష్ట్రసాధారణ పరిపాలనశాఖ జీవోఆర్టీ నెంబరు 1490 జారీ చేసింది. బృందంలో కొత్తగా డీఎస్పీ హోదాలో విశాఖ పోలీసు కమిషనరేట్ లో సౌత్ ఏసీపీగా పనిచేస్తోన్న వై.శ్రీనివాసరావును నియమించింది. అదేవిధంగా ఐవోపీగా రాజమహేంద్ర వరం సీఐడీ ఆర్‌వో బి.వెంకటేశ్వరావును నియమించిం ది. కోరుకొండ ఎస్‌ఐ టీవీఎస్‌ఎన్ శ్యాంసుందర్, రాజ మహేంద్రవరం స్పెషల్ బ్రాంచ్ హెడ్‌కానిస్టేబుల్ (హెచ్‌సీ) నామల దొరబాబు, కాకినాడ వన్‌టౌన్ హెచ్‌సీ కేఎస్‌ఎస్ శాస్త్రి, విశాఖ సీఐడీ ఆర్‌వో అయిన హెచ్‌సీ సీహెచ్.శ్రీని వాసరావు, రాజమహేంద్రవరం సీఐడీ ఆర్‌వో అయిన హెచ్‌సీ ఎ.ఉమామహేశ్వర రావు, రాజమహేంద్రవరం వన్‌టౌన్ కానిస్టేబుల్ ఎం. లోవరాజు, కాకినాడ టూ టౌన్ కానిస్టేబుల్ ఎల్.పర మేశ్వరరావు, రాజమహేంద్రవరం సీఐడీ ఆర్వో కానిస్టే బుల్ ఎం.మురళీకృష్ణను బృందంలో నియమించారు.