అవగాహన, తగిన జాగ్రత్తలతో ఎయిడ్స్ నివారణ
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:20 AM
రాజమహేంద్రవరంఅర్బన్, సెప్టెంబరు10 (ఆంధ్రజ్యోతి): అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై జిల్లా సమగ్ర వ్యూహం (దిశ) ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వై.జంక్షన్ నుంచి గోదావరి ఇస్కాన్ టెంపుల్ వ
ఎర్రబెల్లూన్లు ఎగురవేసి మారథాన్ 5కే రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరంఅర్బన్, సెప్టెంబరు10 (ఆంధ్రజ్యోతి): అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై జిల్లా సమగ్ర వ్యూహం (దిశ) ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వై.జంక్షన్ నుంచి గోదావరి ఇస్కాన్ టెంపుల్ వరకూ మారథాన్ 5కే -రెడ్ రన్ నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి ఈ మారథాన్‌ను ఎర్రబెలూన్లు ఎగురవేసి, జెండా ఊపి, గన్‌పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదివేలకు పైగా హెచ్‌ఐవీ కేసులున్నాయని, వీటిని పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి, యువతకు ఈ వ్యాధిపై అవగాహన కల్గించడానికి ఈ 5కే రన్ నిర్వహించి నట్టు చెప్పారు. జిల్లాలో హెచ్‌ఐవీ కౌన్సెలింగ్, పరీక్షల కోసం ఐదు ఎస్‌ఏ-ఐసీటీసీ కేంద్రాలు, 38 పీహెచ్‌సీ ఎఫ్1 ఐసీటీసీ కేంద్రాలు, 14 యూపీహెచ్‌సీ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించడానికి సంచార సమీకృత సలహా, పరీక్షా కేంద్రం (మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్)ను కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు. హెచ్‌ఐవీ సంబంధిత సమాచారం కోసం జాతీయ హెల్ప్‌లైన్ నెంబరు 1097 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్, కుష్టు క్షయ నివారణాధికారిణి డాక్టర్ వసుంధర, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ గన్ని మహాలక్ష్మి, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రెడ్ రిబ్బన్ కో ఆర్డినేటర్ రవితేజ, వీటీ కళాశాల ప్రతినిధి జేజే విజయ్ ప్రకాష్, దిశ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం, ఏఆర్‌టీ సెంటర్ వైద్యులు, ఆర్ట్స్ కళాశాల, వీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రియదర్శిని, సాయి నర్సింగ్ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం 5కే రెడ్ రన్ విజేతలను బాలురు, బాలికల విభాగంతోపాటు ట్రాన్స్‌జెండర్ల విభాగంలోనూ ఎంపిక చేసి వారికి బహుమతుల ప్రదానం చేశారు.