Share News

పుష్కర..గోదారి!

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:41 AM

2027 గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించ ను న్నారు.

పుష్కర..గోదారి!
రాజమహేంద్రవరంలో గత పుష్కరాలకు నిర్మించిన అతిపెద్ద కోటిలింగాల ఘాట్‌

2027లో గోదావరి పుష్కరాలు

కోట్లాది మంది భక్తుల అంచనా

మరిన్ని ఘాట్లకు ప్రతిపాదనలు

ప్రజాప్రతినిధుల అంచనాలు

కాకినాడలో 10 ఘాట్లు

ఉమ్మడి జిల్లాలో పుష్కర సందడి

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

2027 గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించ ను న్నారు. కోట్లాది మంది భక్తులు తరలి వచ్చే పుష్కర స్నానాలకు ప్రభుత్వం ఇప్పటి నుం చే ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గోదావరి వెంబడి స్నానపు ఘా ట్లను భారీస్థాయిలో సిద్ధం చేస్తోం ది. ఒకే సారి లక్షలాది మంది స్నానం చేసేలా ఘాట్లను తీర్చిదిద్దనున్నారు.పుష్కర స్నానా లు రాజమహేంద్రవరం, కొవ్వూరులో అత్య ధికంగా జరగనుండగా ఆ తర్వాత కాకినా డ, కోనసీమ జిల్లాల్లో జరగనున్నాయి.

కాకినాడలో 10 ఘాట్లు..

కాకినాడ జిల్లాలో పది ఘాట్లను రూ.5 కోట్లతో సుందరీకరించేందుకు అంచనాలు సిద్ధం చేసింది. పదిలో కాజులూరు మం డలంలో రెండు, తాళ్లరేవు మండలంలో 8 ఘాట్లను ముస్తాబు చేయాలని నిర్ణయించింది. ఒక్కో ఘాట్‌ 15 నుంచి 30 మీటర్ల మేర పొడవుతో నిర్మి స్తోంది. కాజులూరు మండలం పెద్దలంక, అండ్రంగి, తాళ్ల రేవు మండలం పిల్లంక, గోపుల్లంక, గోవలంక వద్ద 20 మీటర్ల పొడవైన ఘాట్ల ను ఆధునికీకరిస్తోంది.కొత్తగా ఇంజరం, పిల్లంక వద్ద కొత్తలంక పరిధి , తాళ్లరేవు పట్టణం ఐత్రీయ కోరంగి బ్రాంచి వద్ద నందిరేవులో కొత్త స్నానపు ఘాట్‌ను నిర్మించనున్నారు. కోరంగిలో శివాలయం, వేణుగోపాలస్వామి ఆల యాల వద్ద గోదావరిని ఆనుకుని మరో ఘాట్‌ నిర్మించనున్నారు. తాళ్లరేవు మండలంలో సిద్ధం చేస్తోన్న ఎనిమిది ఘాట్లకు కాకినాడతో పాటు కోన సీమ జిల్లా నుంచి భారీగా పుష్కర స్నానాలకు భక్తులు వస్తారని అధికా రులు అంచనా వేస్తున్నారు. అఖండ గోదావరి నది సముద్రంలో సంగ మించే చివరి ప్రాంతం తాళ్లరేవు, యానాం కావడంతో పుష్కర స్నానాలకు భక్తులు ఇక్కడకు భారీగా వస్తారని భావిస్తు న్నారు.పైగా గోదావరి మూడు పాయలు కలిసే ప్రాంతం ఇక్కడే కావడంతో సెంటిమెంట్‌గా భావించి స్నానాలకు ఇక్కడకు వచ్చే వారు లక్షల్లో ఉంటారని లెక్కలేస్తున్నారు. 2015 పుష్కరాల్లో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గోదావరి మూడు పాయలు కలిసే యానాం సమీపంలో పుష్కర స్నానం ఆచరించడంతో ఇక్కడ స్నానమాచరిస్తే మరింత పుణ్యం వస్తుందని ప్రచారం జరిగి అప్పట్లో లక్షల్లో పోటెత్తారు. దీంతో ఈసారి కూడా ఎంత రద్దీ వచ్చినా తట్టుకునేలా ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కోనసీమలో కోటిపల్లి, కపిలేశ్వర పురం, యానాం, నగరం, అప్పనపల్లి, ముక్తేశ్వరం, మురమళ్ల, కుండలేశ్వరం, కొత్తపేట, జొన్నాడ, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఘా ట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా ఘాట్లు పెంచే యోచనలో ఉన్నారు.

రాజమహేంద్రవరంలో ఒకే ఘాట్‌ అయ్యేనా?

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో 20 27లో జరిగిన గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా స్నానాల రేవుల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుం ది. గత నెలలో మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ రాజమహేంద్రవరం కార్పొ రేషన్‌లో అధికారులు, ఎమ్మెల్యేలతో నూతన ఘాట్లు, ఘాట్ల అనుసంధాన ప్రక్రియపై చర్చించారు.రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్‌ మొదలుకొని పుష్కరాల రేవు వరకూ ఘాట్లను అనుసంధానం చేసే ప్రక్రియపై ప్రతిపాదనలు ఉన్నాయి.ఈ ఘాట్లు కలుపుతారా విడివిడిగా అభివృద్ధి చేస్తారా అనేది తేలాల్చి ఉంది. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామ పరిధిలో నాల్గో బ్రిడ్జి కింద నుంచి రెండు అతిపెద్ద వీఐపీ ఘాట్లను నిర్మించాలనే ప్రతిపాదన చేశారు. రాజానగరం నియోజకవర్గం బొబ్బిల్లంక, మునికూడలి ప్రాంతాల్లోనూ ఘాట్లు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

కొవ్వూరులో ఇలా..

కొవ్వూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కొవ్వూరు డివిజన్‌ పరిధిలో రూ.135.50 కోట్లతో 53 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో 8 రేవులు 1.2 కిలోమీటర్లు మేర రూ.90 కోట్లతో ఒకే ఘాట్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లను భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తరించడంతో, మరి కొన్ని కొత్తఘాట్లను ప్రతిపాదించారు. కొవ్వూరు పట్టణ, మండలంలో పాతవి 20, కొత్తవి 8, తాళ్లపూడి మండలం లో పాతవి 8, కొత్తవి 2, నిడదవోలు పట్టణ, మండలంలో పాతవి 3, కొత్తవి 2, పెరవలి మండలంలో పాతవి 7, కొత్తవి 3 ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు.నిడదవోలు మం డలం విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు గోదావరి ఏటిగట్టు రహదారి సుమారు 30 కి.మీ రూ.70 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెప్పారు

Updated Date - Dec 06 , 2025 | 12:41 AM