ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:23 AM
ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై దళిత, బహుజన, గిరిజనులు ఐక్య పోరాటాలు సాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ నిరసన ధర్నా నిర్వహించారు.
రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నిరసన ధర్నా
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై దళిత, బహుజన, గిరిజనులు ఐక్య పోరాటాలు సాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి మధు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల కాలంలో దళితులు, గిరిజనులు, మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. దేశంలో మతోన్మాద పాలన సాగుతున్నదని, అణచివేత అంటరానితనం, కుల మత వివక్షత, హింస పేట్రేగిపోతున్నదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లోనే రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులను హరించే శక్తులను తిప్పికొట్టేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి గోకవరం బస్టాండు అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షుడు కూండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి కొండలరావు, సహాయ కార్యదర్శి లావణ్య, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, జట్ల సంఘం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.